జట్టున్నమ్మ ఏ కొప్పయినా పెడుతుందని సామెత. డబ్బులు ఉంటే కొండమీది కోతేకాదు, డైనోసార్ కూడా దిగివస్తుంది. ధనికులు తాము ఇతరులకు భిన్నంగా జీవించాలనుకోవడం సహజమే. కట్టుబొట్టు, కారూబైకూ, తిండితిప్పల్లో తమదైన వెరైటీ లేకపోతే దర్జా ఏముంటుందని వారి భావన. అలాంటి వారి కోసం కంపెనీలు కూడా ఎప్పటికప్పుడు లగ్జరీ ఉత్పత్తులు మార్కెట్లోకి తీసుకొస్తుంటాయి. వాటిలో టీ పొడి మొదలుకుని వజ్రాల నెక్లెసుల వరకు ఉంటాయి.
మన దేశానికి చెందిన ఓ బ్రాండ్ టీపొడి కేజీ అక్షరాలా రూ. 75000లకు అమ్ముడుబోయింది. అస్సాంలోని దిబ్రూగఢ్‌లో ఉన్న మనోహరి ఎస్టేట్‌లో పండిన తేనీటి పొడిని గువాహటి టీ ఆక్షన్ సెంటర్ వేలం వేసింది. ఓ తేనీటి లవర్ దీన్ని భారీ ధరకు కొన్నారు. ‘మనోహరి గోల్డ్ టీ’ పేరుతో నాణ్యమైన టీపొడిన తయారు చేస్తున్నారు. చక్కని వాసనతో కూడిన మేలిరకం టీ బడ్స్‌తో దీన్ని తయారు చేస్తామని మనోహరి టీ ఎస్టేట్ డైరెక్టర్ రాజన్ లోహియా వివరించాడు. దీని కోసం ఆకులు తెల్లవారుజామున సూర్యకిరణాలు ప్రసరించడానికి ముందే కోస్తామని చెప్పాడు. మనోహరి టీ గతంలో కేజీ రూ. 50 వేలు పలికింది.