Rare pink diamond unearthed in Angola may be the largest found in 300 years
mictv telugu

లుపాకా వజ్రం.. దిమ్మతిరిగే ధర.. రూ. 900 కోట్లు

July 27, 2022

Rare pink diamond unearthed in Angola may be the largest found in 300 years
ఆఫ్రికా ఖండంలోని అంగోలాలో ప్రపంచంలోనే అరుదైన పెద్ద పింక్ వజ్రం బయటపడింది. అంగోలాలో వజ్రాల కోసం తవ్వకాలు జరుపుతున్న ఆస్ట్రేలియన్ సంస్థ లుపాకా డైమండ్ కంపెనీ ఈ డైమండ్ ను గుర్తించినట్టు ప్రకటించింది. ఈ వజ్రం అచ్చమైన లేత గులాబీ రంగులో ఏకంగా 170 క్యారెట్ల బరువు ఉందని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా గత 300 ఏళ్లలో గుర్తించిన అతిపెద్ద పింక్ డైమండ్ ఇదేనని భావిస్తున్నట్టు వెల్లడించింది.

సహజమైన వజ్రాల్లో అత్యంత స్వచ్ఛతతో.. పూర్తిగా ఒకే రంగుతో ఉన్నవి అత్యంత అరుదుగా ఉంటాయని..ఈ పింక్ డైమండ్ ఆ అరుదైన కేటగిరీలోకి వస్తుందని లుపాకా కంపెనీ ప్రకటించింది. ఈ వజ్రానికి ‘లులో రోజ్’ అని పేరు పెట్టారు. ప్రస్తుతం ముడి రూపంలో ఈ వజ్రాన్ని సానబెడితే.. 85 నుంచి 90 క్యారెట్ల వరకు ఉండే ఉండే ఒక పెద్ద పాలిష్డ్ వజ్రం, మరిన్ని చిన్న వజ్రాలు రూపొందుతాయని లుకాపా డైమండ్ కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

మైన్ నుంచి పింక్ వ‌జ్రం ల‌భించ‌డం ఇది రెండ‌వ‌సారి అని ఆంగోలా గ‌నుల‌శాఖ మంత్రి డ‌మాంటినో అజివేడో తెలిపారు. 2017లో అచ్చం ఇదే తరహాలోని స్వచ్ఛమైన డైమండ్ ‘పింక్ స్టార్’ను హాంకాంగ్ లో వేలం వేశారు. 59.6 క్యారెట్ల బరువైన ఆ వజ్రానికి 71.2 మిలియన్ డాలర్లు (మన కరెన్సీలో సుమారు రూ.570 కోట్లు) పలికింది.కొత్త‌గా దొరికిన పింక్ డైమండ్ అంత‌క‌న్నా ఎక్కువ ధ‌ర‌కు అమ్ముడుపోయే అవ‌కాశాలు ఉన్నాయి. అంటే రూ.900 కోట్ల నుంచి రూ.1000 కోట్ల దాకా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.