కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో రసాభాస - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో రసాభాస

May 11, 2022

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామమైన యాదాద్రి భువనగిరి జిల్లాలోని తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో బుధవారం నిర్వహించిన గ్రామసభ రసాభాసగా మారింది. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి నేతృత్వంలో గ్రామ పునర్నిర్మాణానికి సంబంధించి తీర్మానం కోసం గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామసభ తీర్మానాన్ని ఆమోదిస్తున్నట్టు సర్పంచ్ చెప్పడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాన్ని పునర్నిర్మించాలంటే గ్రామసభ కంటే ముందు ప్రజాభిప్రాయసేకరణ చేయాలని పట్టుబట్టారు. ప్రజల అనుమానాలు తీరాకే తీర్మానాన్ని ఆమోదించాలని డిమాండ్ చేశారు. గ్రామస్తుల డిమాండ్‌పై కలెక్టర్ స్పందిస్తూ.. ప్రస్తుతం ఉన్నట్టుగానే గ్రామాన్ని తిరిగి నిర్మిస్తామని చెప్పారు. అయినా తీర్మానంపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో కలెక్టర్ మధ్యలోనే లేచి వెళ్లిపోయారు.