మహారాష్ట్రలో శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేల వ్యవహారం పలు మలుపులు తిరుగుతోంది. రెబెల్ ఎమ్మెల్యేల తీరుతో సర్కారు కూలిపోయే అవకాశం ఉండగా, వారిని ఒకవైపు బుజ్జగింపులు, మరోవైపు హెచ్చరికలతో దారికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఉద్ధవ్ థాకరే. అయితే ఆయన మాటలను రెబెల్ ఎమ్మెల్యేలు పట్టించుకున్న దాఖలాలు ఇప్పటివరకు కనిపించలేదు. ఈ క్రమంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు ఉద్ధవ్ భార్య రష్మీ ధాకరే రంగంలోకి దిగారు. రెబెల్ ఎమ్మెల్యేల భార్యలతో ఆమె భేటీ నిర్వహిస్తున్నారు. తమ భర్తలకు నచ్చజెప్పి తిరిగొచ్చేలా చేయమని వారిని కోరుతున్నారు. అటు పార్టీ కీలక నేత సంజయ్ రౌత్ ట్విట్టర్లో ‘ఎంతకాలం గౌహతిలో దాక్కుంటారు. ఎప్పటికైనా ఇక్కడికి రావాల్సిందే’నంటూ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా, రెబెల్ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సమన్లు పంపించారు. అనర్హులుగా ప్రకటించాలని దాఖలైన ఫిర్యాదులపై లిఖిత పూర్వక జవాబు ఇవ్వాలని అందులో పేర్కొన్నారు.