ప్రతీ ఏడాది రాష్ట్రపతి శీతకాల విడిది ముగిశాక బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి సందర్శకులను అనుమతించే సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా రాష్ట్రపతి నిలయం చూడాలనుకొనే వారికి అధికారులు ఆ అవకాశం కల్పించారు. గత నెల 30 వరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇక్కడే బస చేశారు. ఈ నేపథ్యంలో జనవరి 3 నుంచి 15 వరకు రాష్ట్రపతి నిలయం సందర్శనకు అనుమతి ఇచ్చారు. ఈ చారిత్రక భవనాన్ని చూడాలనుకొనే వారు నేరుగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకోవచ్చు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య ప్రజల కోసం బొల్లారంలోని భారత రాష్ట్రపతి నిలయం తెరిచి ఉంటుంది. ప్రతి సందర్శకుడికి ప్రవేశ టిక్కెట్టు జారీ చేయబడుతుంది. అయితే.. రాష్ట్రపతి భవన్ గేట్ నంబర్ 2 సమీపంలోని కౌంటర్ వద్ద సందర్శించిన తర్వాత దానిని తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది.
గత రెండు రోజులుగా హైదరాబాద్ నగరప్రజలు, విద్యార్థులు పెద్ద ఎత్తున రాష్ట్రపతి నిలయం అందాలను అస్వాదించేందుకు తండోపతండాలుగా తరలివస్తున్నారు. రాష్ట్రపతి విడిదిలోని అందాలను చూసి ఆనందిస్తున్నారు. కరోనా మహమ్మారి ప్రభావం కారణంగా గత రెండేళ్లుగా రాష్ట్రపతి విడిది సందర్శనను అధికారులు రద్దు చేశారు. ఇప్పుడు పరిస్థితులు కుదుట పడటంతో మళ్లీ రాష్ట్రపతి నిలయం సందర్శకులతో కళకళలాడుతోంది.
ఒకే అంతస్థుల రాష్ట్రపతి నిలయ ప్రధాన భవనం 1860లో నిర్మించబడింది. ఇందులో 16 గదులు ఉన్నాయి. ఇందులోనే డైనింగ్ హాల్, దర్బార్ హాల్, మార్నింగ్ రూమ్, పిల్లల గది మరియు ఇతర సౌకర్యాలు ఉన్నాయి. రాష్ట్రపతి నిలయంలోని ప్రధాన భవనంతోపాటు రాక్ గార్డెన్, ఫౌంటెన్ సందర్శకులకు కొత్త అనుభూతిని పంచుతోంది. ప్రాంగణంలోని చల్లని వాతావరణంతో పిల్లలు, పెద్దలు సేద తీరుతున్నారు. ఇక్కడున్న ఫ్లవర్ గార్డెన్ చూపరులను ఆకట్టుకుంటోంది. 2010లో ప్రతిభాపాటిల్ ఔషధవనాన్ని పెంచి కొత్త సంప్రదాయానికి తెరలేపారు. వనాన్ని ప్రజలు తిలకించేలా కొత్త సంప్రదాయాన్ని ప్రారంభించారు.