ధరల మీద మన్నుపొయ్య ! - MicTv.in - Telugu News
mictv telugu

ధరల మీద మన్నుపొయ్య !

July 11, 2017


మనం గట్టిగ ఎగురుతే ఆకాశంను గూడ అందుకుంటమేమో గానీ ఈ ధరల పెరుగుదలను అస్సలు అందుకోలేము కదా ? దిగుబడులు ఎక్కువున్నప్పుడు ధరలు తక్కువుంటయి.. అదే దిగుబడులు జర్రంత అటూ ఇటైనా ధరలు అందకుండా సామాన్య జనాలతోని ఫుట్ బాల్ ఆడుకుంటుంటయి. ఉన్న దిగుబడులు ఖాళీ అవుతున్నప్పుడు కొత్త దిగుబడుల కోసం ప్రత్యాన్మయాలను వెదికితే ధరల అవకతవకలు అస్సలు వుండవు కదా. అంటే మన సర్కారులకు ( కేంద్ర – రాష్ర్ట ) ముందు చూపు లేదనేది స్పష్టంగా తెలుస్తోంది. కిలో టమాట 100, కిలో పచ్చి మిర్చి ధరలు 80 రూపాయలుగా మార్కెట్లో నువ్వా – నేనా అన్నట్టు పోటీల మీద సాగుతున్నాయి. పైసలున్నోళ్ళకు ధరలు పెరిగినా తగ్గినా పెద్దగా పరక్ పడదు గానీ.. రెక్కల కష్టం మీద ఆధారపడ్డ సామాన్య జనాల పరిస్థితే అగమ్య గోచరంగా వుంటోంది ? ప్రభుత్వాలకు అన్నీ చేతనైతయి గనీ ధరలను అదుపులో పెట్టడం ఎప్పటికీ చేతకాని పని ?
ఒక్కో ప్రాంతంలోని నేలలో ఒక్కో రకమైన పంటలు పండుతాయి. భూమిలో నీరు, తేమ వంటివి లెక్కలోకి తీస్కొని ఒక ప్రణాళిక ప్రకారం పంటలు వెయ్యాల్సి వుంటుంది. అటువంటి భూముల సర్వేలు చేసి రైతులకు ఆ నేలల్లో ఏ పంటలు వేయాలనే పక్కా ప్రణాళికను వాళ్ళకు అందజెయ్యాల్సిన అవసరం వుంది కదా.

రైతులు కూడా ప్రభుత్వాలు చెప్పే సూచనలను పాటిస్తే ఉత్పత్తి ఆగిపోదు కదా. అట్లనే ప్రభుత్వం పక్క రాష్ర్టాల్లో ఏయే పంటలు ఎక్కువగా పండుతాయి ? మనం ఇక్కడ ఎక్కువగా పండించుకున్న దాన్ని వాళ్ళకు ఎగుమతి చేసి మనం వాళ్ళ నుంచి ఏం దిగుమతి చేస్కోవచ్చనే విషయంలో ప్రభుత్వాలు తీస్కుంటున్న చొరవ ఎంత ? అట్ల ఒక ఐడియాలజీని ఫాలో ముందునండే అయితే ధరలు ఎగ్గుడు – తగ్గుడు వుండదు కదా ?

ధరలు పెరిగినప్పుడు అయ్యో పెరిగాయా.. మేము యాక్షన్ తీస్కుంటమని సర్కారోళ్ళు ఊకదంపుడు మాటలు మాత్రమే కొడతారు. యాక్షన్ లో దెబ్బలు తగిలేవి గరీబ్ గాళ్ళకే. ఉప్పులు, పప్పుల కాన్నుంచి సురువు జేస్తే తుర్పయి కుట్టే సూది వరకు అన్నీ అమాంతంగా ధరలు పెరిగితే మధ్య తరగతి వాడు ఏం చెయ్యాలి ?

పైనుండి ఇప్పుడు GST ఒకటి దాపురించింది ? సంపాదన అంతంత మాత్రమే వున్నసగటు మనిషి పెరిగిన ధరలతో సతమతమైపోవాల్సిందేనా ? ఎప్పుడు చూసినా మా ప్రభుత్వం ప్రజల పక్షం అని లొల్లి పెట్టే సర్కారోళ్ళు ముప్పు కన్నా ముందే స్పందించరెందుకు ? ధరలు పెరిగినప్పుడు కమ్మగ, పుల్లగ తినే కాయిషును చంపుకొని ఉప్పుషార్లు, పచ్చి పుల్సులు, తొక్కులసుంటియి తిని కడుపు నింపుకొని, పానాలు కాపాడుకుంటే సరిపోతుందని, ధరలు తగ్గంగనే చికెన్లు, మటన్లు తిందురు గనీ అని అన్నా అంటరు అధికారులు.

పేదోళ్ళ ఉసురు ముట్టించుకుంటున్న ఈ ధరల మీద మన్నుపొయ్య అని చేతకాని సర్కార్ మీద ప్రజలు నారాజవుడు ఎప్పటికి పోదేమో ??