10 తులాల బంగారం పట్టించిన ఎలుకలు - MicTv.in - Telugu News
mictv telugu

10 తులాల బంగారం పట్టించిన ఎలుకలు

June 18, 2022

ఈ విషయాన్ని పోలీసులే ధృవీకరించారు. ఇదేంటీ.. పోలీసులకు కుక్కలు హెల్స చేస్తాయి కదా. ఎలుకలు ఎలా సహాయం చేశాయబ్బా.. అని అనుకుంటున్నారా. అయితే ముంబైలో జరిగిన ఈ ఘటన పూర్తి వివరాలు చదవండి.. దిండోశీ ప్రాంతంలోని ఆరే కాలనీలో నివాసం ఉండే సుందరి పలినివేల్ అనే వ్యక్తి ఇటీవల తన కూతురు వివాహం చేశారు. ఈ పెళ్లిలో అప్పులవ్వడంతో లోన్ కోసం నగలు తాకట్టు పెట్టాలని నిర్ణయించి బంగారు నగలన్నీ ఓ సంచిలో మూటగట్టుకొని బ్యాంకుకు బయల్దేరారు. నగలతో పాటు ఇంట్లో మిగిలిపోయిన వడాపావ్ బిచ్చగాళ్లకు ఇద్దామని నగలున్న సంచీలోనే వేసుకొని తీసుకెళ్లారు. దారిలో ఓ ముసలావిడ కనపడితే ఆమెకు వడాపావ్ ఉన్న సంచీ ఇచ్చి బ్యాంకుకు వెళ్లిపోయారు. తీరా అక్కడికెళ్లాక చూస్తే వడాపావ్ ఉన్న సంచీలోనే నగలు కూడా ఉన్నాయని గుర్తించి హుటాహుటిన తిరిగొచ్చారు. ముసలావిడ కనిపించకపోయేసరికి పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు వెతికి ముసలావిడను పట్టుకున్నారు. అడిగితే.. వడాపావ్ పాడైపోయాయని, అందుకే ఆ సంచీని కుప్పతొట్టితో వేసేశానని చెప్పి తొట్టి చూపించింది. అందులో వెతకగా.. సంచీ కనిపించకపోవడంతో అక్కడున్న సీసీ కెమెరాలను పోలీసులు చెక్ చేశారు. దాంట్లో ఎలుకలు ఆ సంచీని లాక్కెళుతున్న దృష్యాలు రికార్డవడంతో ఆ దిశగా పోలీసులు సంచీ కోసం వెతికారు. ఫుటేజ్ ప్రకారం ఫాలో అయిన పోలీసులకు ఎలుకలు లాక్కెళ్లిన సంచీ కనపడింది. దాంట్లో వెతికి చూడగా, వడాపావ్ మొత్తం తినేసి నగలను మాత్రం అలాగే ఉంచాయి ఎలుకలు. పోలీసులు వాటిని తీసుకొచ్చి సుందరికి అప్పగించగా, మొత్తం 10 తులాల బంగారం సేఫ్‌గా ఉన్నట్టు తేలింది.