భారత్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఏడాది కాలంగా పొట్టి ఫార్మెట్లో దంచి కొడుతున్నాడు. బౌలర్ ఎవరైనా లెక్కచేయకుండా బౌండరీలతో విధ్వంసం సృష్టిస్తున్నాడు.చకొత్త కొత్త షాట్లు అతని బ్యాట్ నుంచి క్రికెట్ లోకానికి పరిచయమవుతున్నాయి. ఇటీవల జరిగిన వరల్డ్ కప్‌లోను మిస్టర్ స్కై అద్భుత ప్రదర్శన కనబరిచాడు. తర్వాత న్యూజిలాండ్ టీ20 సిరీస్‌లో సెంచరీతో చెలరేగాడు. ఇక న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో సూర్యకుమార్ యాదవ్ విఫలమయ్యాడని అతనిపై విమర్శలు వచ్చాయి. 50 ఓవర్ల ఆటకు అతడు పనికిరాడని కామెంట్లు వినిపించాయి. వీటిపై టీం ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. సూర్యకుమార్‌ను తక్కువ అంచనా వేయొద్దని సూచించాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడని కొనియాడాడు. సౌతాఫ్రికా దిగ్గజం, మిస్టర్ 360 ప్లేయర్ ఏబీ డివిలియర్స్ లాంటివాడనిపోల్చిచెప్పాడు. ఒకటి, రెండు ఇన్నింగ్స్‌ల్లో విఫలమయ్యాడని తక్కువగా చూడొద్దన్నాడు. అతను 30-40 బంతులు ఎదుర్కొంటే మ్యాచ్‌ని గెలిపించగలడని..ఏబీ డివిలియర్స్లా స్పెషల్ ఇన్నింగ్స్ ఆడి ప్రత్యర్థి జట్టుకి వణుకు పుట్టిస్తాడని రవిశాస్త్రి చెప్పాడు.
ఆదివారం జరిగిన న్యూజిలాండ్, భారత్ మధ్య రెండో వన్డే వర్షం కారణంగా రద్దైంది. టీమిండియా ఇన్నింగ్స్ 12.5 ఓవర్ల వద్ద భారీ వర్షం కురవడంతో మ్యాచ్‌ని రద్దు చేసినట్లు అంపైర్లు ప్రకటించారు. ఆటను రద్దు చేసే సమయానికి భారత్ 12.5 ఓవర్లలో 89/1 స్కోరుతో నిలిచింది. అప్పటికి సూర్యకుమార్ యాదవ్ 25 బంతుల్లో 34 పరుగులు చేసి క్రీజ్‌లో ఉన్నాడు. వర్షంతో మ్యాచ్ రద్దవ్వకపోతే మాత్రం అతడు భారీ ఇన్నింగ్స్ ఆడేవాడేమో. అప్పటికే మంచి టచ్‌లో కనిపించాడు. రెండు ఫోర్లు, మూడు సిక్స్‌లతో దూకుడు మీద ఉన్న అతడి వేగానికి వర్షం అడ్డుకట్ట వేసింది.