భార్య బీజేపీ.. అక్క కాంగ్రెస్..జడేజా ఇంటి రాజకీయం - MicTv.in - Telugu News
mictv telugu

భార్య బీజేపీ.. అక్క కాంగ్రెస్..జడేజా ఇంటి రాజకీయం

April 15, 2019

రాజకీయాల్లో వింత సంఘటనలకు కొదువేమి లేదు.. ఒకే కుటుంబానికి చెందిన సభ్యులు రెండు వేరు వేరు పార్టీలలో చేరిన సంఘటనలు కోకొల్లలు. అయితే తాజాగా ఇలాంటి సంఘటనే స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా ఇంట జరిగింది. ఆయన భార్య రివబ జడేజా గత నెల భారతీయ జనతా పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. జడేజా, రివబ కలిసి న్యూఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలిశారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో జడేజా భార్య బీజేపీలో చేరడం ఆసక్తికరంగా మారింది. అయితే, దానికన్నా ఆసక్తికర విషయం ఆదివారం మరొకటి చోటుచేసుకుంది.

రవీంద్ర జడేజా పెద్ద అక్క నైనా జడేజా ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. జామ్‌నగర్‌లోని కలవాడ్‌లో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో నైనా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తన తండ్రి అనిరుధ్ సిన్హ్ జడేజా సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ ఎన్నికల ప్రచార సభలో ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన హార్దిక్ పటేల్ కూడా పాల్గొన్నారు. కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థి ములు కండోరియా తరఫున నైనా జడేజా ప్రచారం చేయనున్నారు. తాను మాత్రమే కాంగ్రెస్‌లో చేరానని, తన తండ్రి తనకు మద్దతు మాత్రమే ఇస్తున్నారని నైనా స్పష్టం చేశారు. గుజరాత్‌లో మొత్తం 26 లోక్‌సభ స్థానాలకు గాను ఒకే దశలో ఏప్రిల్ 23న ఎన్నికలు జరగనున్నాయి.