Rayalaseema tragedy political regional causes
mictv telugu

రాయలసీమ దుఃఖచిత్రం.. ఎన్నాళ్లీ కన్నీళ్లు?

November 17, 2022

Rayalaseema tragedy political regional causes

రాయలసీమ ప్రాంత అభివృద్ధికి కీలకమైన శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేయాలన్న డిమాండ్ మళ్లీ ఊపందుకుంది. బుధవారం విజయవాడలో జరిగిన ‘రాయలసీమ సత్యగ్రహం’లో ఉద్యమ నేతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పాత రాజధానిని పునరుద్ధరించి, గుక్కెడు నీళ్లిచ్చి, కాస్త గౌరవమైన యూనివర్సిటీలను నెలకొల్పే నాయకులే లేరా అని వాపోయారు. విజయవాడకు కాస్త దగ్గర్లోనే ఉన్న రాయలసీమకు చెందిన ముఖ్యమంత్రి కార్యాలయానికి ఆ ఘోష వినబడిందో లేదో మరి!

ఈ సీఎంలంతా సీమోళ్లే..

వడ్డించేంది మనవాడైతే ఏ బంతిలో కూర్చున్నా ఒకటే అని అంటారు. కానీ రాయలసీమ విషయంలో మాత్రం దీనికి భిన్నంగా జరుగుతోంది. 1937 నాటి శ్రీబాగ్ ఒప్పందాన్నిగాని, సీమను కరువు నుంచి, వెనకబాటుతనం నుంచి తప్పించే ఇతర డిమాండ్లుగానీ ఏమాత్రం నెరవేరడం లేదు. సీమ నుంచి ఎంతోమంది సీఎంలు ఉన్నా, ప్రస్తుతమూ ఉన్నా నిరాశే ఎదురవుతోంది. ఉమ్మడి ఏపీకీ సీఎంలుగా పనిచేసిన నీలం సంజీవరెడ్డి, దామోదరం సంజీవయ్య, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖరెడ్డి, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, కొత్త ఏపీకి సీఎంలుగా పనిచేసిన చంద్రబాబు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎందుకు సీమ కన్నీటి తడి తుడవలేకపోతున్నారు?

రాజకీయ సమీకణాలు

ఉమ్మడి ఏపీలో ఆంధ్రా లాబీయింగ్ ప్రయోజనాల ముందు సీమపై శీతకన్నేశారు. హైదరాబాద్ రాజధాని కావడంతో అభివృద్ధి మొత్తం అక్కడికే పరిమితమై మిగతా ప్రాంతాల నోట్లో మన్నుకొట్టారన్నది సీమవాసుల అభిప్రాయం. తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత ఏపీకి రాజధాని లేకుండా పోయింది. జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన వివాదాస్పదం. కర్నూలుకు హైకోర్టు ప్రతిపాదన స్వాగతించదగ్గ విషయమే అయినా ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా ఉండిన కర్నూలును మళ్లీ రాజధానిగా చెయ్యాలనే డిమాండ్ బాగానే వినిపించింది. జగన్ దీన్ని పట్టించుకోలేదు. ఇప్పటికే అభివృద్ధి చెందిన విశాఖను రాజధానిగా నిర్ణయించారు. చంద్రబాబు పెట్టిన రాజధాని అమరావతిలోని తన ప్రత్యర్థులైన కమ్మకుల నేతలను దెబ్బ కొట్టడానికి ఆ నిర్ణయం తీసుకున్న జగన్ పెద్దగా ప్రయోజనం లేని హైకోర్టును కర్నూలుకు కానుకగా ఇచ్చారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలోనూ ఆంధ్రాపై చూపుతున్నంత శ్రద్ధ సీమపై చూపడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. సీమ డిమాండ్లు నెరవేరిస్తే తమ ప్రయోజనాలు దెబ్బతింటాయని ఆంధ్రానేతల వాదన. సీమ ప్రయోజనాలు, తెలంగాణ ప్రయోజనాలతో ముడిపడి ఉండడం మరో సంక్లిష్ట విషయం. ఉమ్మడి ఏపీలో అయినా, ప్రస్తుత ఏపీలో అయినా ఆర్థికంగా, రాజకీయంగా ఆంధ్రా నేతలదే ప్రాబల్యం. మెజారిటీ అసెంబ్లీ సీట్లు ఆంధ్రాలోనే ఉండడంతో అధికారం కాపాడుకోవడానికి సీమ సీఎంలకు ఆ నేతల అండ తప్పనిసరి.

రాజకీయ నిరుద్యోగుల ఉద్యమం

ప్రత్యేక రాయలసీమ, నీటి సాధన ఉద్యమాలు న్యాయమైనవే అయినా వాటి చుట్టూ నెలకొన్న సంక్లిష్టత వల్ల అవి ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. కృష్ణాజలాల విషయంలో ఇటు తెలంగాణతో వివాదాలు, అటు ఆంధ్రా గొడవల మధ్య నలిగే సీమను ఆదుకునే హస్తాలు కనిపించడం లేదు. ఎంతో కొంత చిత్తశుద్ధితో పనిచేసిన ప్రత్యేక రాయలసీమ నేతలు కూడా కాంగ్రెస్, టీడీపీలకు చెందిన వారే కావడంతో ఆ ఉద్యమం కేవలం రాజకీయ నిరుద్యోగుల ఉద్యమం అనే దురభిప్రాయం నెలకొంది. భౌగోళికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా సీమ నుంచి బలమైన న్యాయకత్వం లేకపోవడమే ఆ ప్రాంతానికి శాపమైంది. బలమైన సీఎంలు ఉన్నా, వారి ‘అసలు బలం’ మరొక చోటు ఉండడం వల్ల, కుల రాజకీయాలు, ప్రజల్లో చైతన్యం ఆశించినంతగా లేకపోవడం వల్ల సీమ వేదన అరణ్య రోదనగానే మిగిలిపోతోంది.