మారటోరియం ఆప్షన్ అందరికీ ఇవ్వండి..ఆర్బీఐ - MicTv.in - Telugu News
mictv telugu

మారటోరియం ఆప్షన్ అందరికీ ఇవ్వండి..ఆర్బీఐ

April 7, 2020

RBI asks banks to offer 3-month moratorium

లాక్ డౌన్ కారణంగా ఆఫీసులు, పరిశ్రమలు మూతపడ్డాయి. దీంతో రుణ గ్రహీతలకు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా మూడు నెలల పాటు మారటోరియం విధించింది. ఈ మేరకు దేశంలోని అన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ వెసులుబాటును ఆయా బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు రుణ గ్రహీతలు కోరితేనే అమలు స్తున్నాయి.

దీంతో ఆర్బీఐ మరోసారి బ్యాంకులకు ఆదేశాలను జారీ చేసింది. మారటోరియం సదుపాయాన్ని తప్పనిసరిగా అందరు రుణ గ్రహీతలకు వర్తింపజేయాలని స్పష్టం చేసింది. ఎవరైనా రుణగ్రహీత తనకు ఈ సౌకర్యం అక్కర్లేదని చెబితే మాత్రమే అతడ్ని మారటోరియం పరిధి నుంచి తప్పించాలని ఆర్బీఐ ఆదేశించింది. ఎవరైనా ప్రత్యేకంగా కోరితే తప్ప దీన్ని డిఫాల్ట్ గా అందరు రుణ గ్రహీతలకు వర్తింపజేయాలంటూ అన్ని బ్యాంకులకు, ఫైనాన్స్ సంస్థలకు ఆర్బీఐ ఆదేశాలు జారీచేసింది.

సైబర్ నేరగాళ్లతో తస్మాత్ జాగ్రత్త

మారటోరియం ఎంచుకునే రుణగ్రహీతలను సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేస్తున్నట్టు ఎస్బిఐ బ్యాంకు గుర్తించింది. అందుకే రుణ గ్రహీతలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మారటోరియం ఎంచుకోవడానికి ఓటీపీ అవసరం లేదని ఎస్బిఐ తెలిపింది. అయితే సైబర్ మోసగాళ్లు రుణ గ్రహీతలకు ఫోన్ చేసి మారటోరియం ఎంచుకోవడానికి ఓటీపీ చెప్పాలని అడుగుతున్నారు. ఓటీపీ తెలుసుకొని అకౌంట్‌లో ఉన్న డబ్బులు నొక్కేస్తున్నారు. అందుకే ఈఎంఐ వాయిదా వేయడానికి ఓటీపీ షేర్ చేయాల్సిన అవసరం లేదని, ఎవరికీ ఓటీపీ చెప్పొద్దని ఎస్‌బీఐ కస్టమర్లను కోరుతోంది. ఈ మేరకు ఎస్బిఐ ట్వీట్ చేసింది.