ఆర్బీఐ గవర్నర్‌కు కరోనా పాజిటివ్ - MicTv.in - Telugu News
mictv telugu

ఆర్బీఐ గవర్నర్‌కు కరోనా పాజిటివ్

October 25, 2020

Test Positive

 తాను అంతుచూడని వారు ఈ భూమ్మీద ఎవరూ మిగలొద్దని కంకణం కట్టుకున్నట్టుంది మహమ్మారి కరోనా వైరస్. సామాన్యులనే కాకుండా ఎందరికో కరోనా ముసురుకుంటోంది. దాని దాడిలో డబ్బున్నవారు కూడా తమ ప్రాణాలను కాపాడుకోలేక కరోనాకు బలి అవుతున్నారు. ఇక బడుగు, బలహీన వర్గాల ప్రజలు అయితే వైద్యానికి డబ్బులు లేక ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే చేరి వైద్యం పొందుతున్నారు. అలా వైద్యం పొందుతున్నవారంతా కరోనా నుంచి కోలుకుంటున్నారా అనేది గ్యారెంటీ లేకుండా పోయింది. ఈ క్రమంలో తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత్ దాస్‌కు కరోనా సోకింది. ఆదివారం నాడు ఆయనకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 

ఆ విషయాన్ని ఆయన ఓ ట్విటర్‌లో వెల్లడించారు. ‘నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అయినా నాలో ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు. నేను బాగానే ఉన్నానని వైద్యులు చెప్పారు. ఇటీవల కాలంలో నన్ను కలిసిన వారిని కూడా అప్రమత్తం చేశాను. వారంతా వెళ్లి కరోనా పరీక్షలు చేసుకోవాలని చెప్పాను. ఐసొలేషన్ నుంచే పని కొనసాగిస్తాను. ఆర్బీఐలో పని యథావిధిగానే నడుస్తుంది. డిప్యూటీ గవర్నర్లు, ఇతర అధికారులతో వీడియా కాన్ఫరెన్స్, టెలిఫోన్ ద్వారా ఎప్పటికప్పుడు అందుబాటులోనే ఉంటున్నాను’ అని శక్తికాంత్ దాస్ ట్వీట్ చేశారు. కాగా, దేశంలో వరుసగా మూడో రోజు కూడా కోవిడ్ కేసుల నమోదు 55 వేల కంటే తక్కువగా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం నాడు ఒక ప్రకటనలో వెల్లడించింది. మృతుల సంఖ్య కూడా దాదాపు మూడు నెలల తర్వాత 578కి తగ్గిందని చెప్పింది. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 78 లక్షలకు చేరుకోగా, మృతుల సంఖ్య 1.18 లక్షలకు చేరిందని పేర్కొంది.