RBI hiked repo rate by 35 basis points
mictv telugu

రెపోరేటు పెంచిన ఆర్బీఐ.. పెరగనున్న ఈఎంఐల భారం

December 7, 2022

RBI hiked repo rate by 35 basis points

దేశ కేంద్ర బ్యాంకు ఆర్బీఐ షాకిచ్చింది. 35 బేస్ పాయింట్ల రెపో రేటును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో రెపో రేటు 5.90 శాతం నుంచి 6.25 శాతానికి పెరిగింది. ద్రవ్యోల్బణం ఆందోళణకరంగా ఉండడంతో పెంపు తప్పట్లేదని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. గత ఎనిమిది నెలల్లో ఆర్బీఐ రెపో రేటును 5 సార్లు పెంచగా, 4 శాతం నుంచి 6.25 శాతానికి చేరింది. అంటే ఇప్పటివరకు 2.25 శాతం పెరిగిందన్నమాట. ఆర్బీఐ బ్యాంకులకు ఇచ్చిన మూలధనంపై తీసుకునే వడ్డీనే రెపోరేటు అంటారు.

దీని ఆధారంగానే బ్యాంకులు కస్టమర్లకు ఈఎంఐలను నిర్ణయిస్తాయి. ఇప్పుడు రెపో రేటు పెరిగింది కాబట్టి బ్యాంకులు ఆ భారాన్ని వినియోగదారుల నుంచి వసూలు చేస్తాయి. ముఖ్యంగా హౌస్ లోన్ తీసుకున్న వారిపై ఈ పెంపు ప్రభావం గణనీయంగా పడనుంది. దీనిపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ మాట్లాడుతూ.. మరో ఏడాది ముగింపుకు వస్తున్నా ప్రపంచంలోని చాలా దేశాల్లో ద్రవ్యోల్బణం రేటు పెరుగుతూనే ఉందని చెప్పారు. ప్రపంచ రాజకీయ, భౌగోళిక పరిస్థితుల కారణంగా సప్లై చైన్ సవాళ్లను ఎదుర్కొంటోంది. ద్రవ్యోల్బణం ఆ స్థాయిలో పెరుగుతున్నా బ్యాంకుల క్రెడిట్ వృద్ధి రెండంకెల కంటే ఎక్కువగా వస్తుందన్నారు. దీని గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజలు, మార్కెట్లో నగదు లభ్యతను తగ్గించడమే దీని ఉద్దేశం. తద్వారా వస్తూత్పత్తికి డిమాండ్ తగ్గి ధరలు దిగి వస్తాయనే ఆర్ధిక సూత్రం ఆధారంగా ఆర్బీఐ లాంటి సంస్థలు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటాయని ఆర్ధిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు.