ఆర్బీఐ సంచలన నిర్ణయం తీసుకున్నది. రేపో రేటు సహా కీలక వడ్డీరేట్లను పెంచుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ప్రకటించారు. రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ఆయన తెలిపారు. తాజా పెంపుతో రెపోరేటు 4.40 శాతానికి చేరింది. ఇది తక్షణం అమల్లోకి రానుంది. అలాగే క్యాష్ రిజర్వ్ రేషియో (CRR)ను సైతం 50 బేసిస్ పాయింట్లు పెంచారు. సీఆర్ఆర్ 4.50 శాతానికి చేరింది. ఇది మే 21 నుంచి అమల్లోకి రానుంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ద్రవ్యోల్బణం భారీగా పెరుగుతోందని, ఫలితంగా వడ్డీ రేట్లు పెంచాల్సి వచ్చిందని శక్తికాంత దాస్ చెప్పారు. రేట్ల పెంపునకు మొనటరీ పాలసీ కమిటీ ఏకగ్రీవంగా అంగీకరించినట్లు తెలిపారు. ఆగస్టు 2018 తర్వాత ఆర్బీఐ వడ్డీరేట్లను పెంచడం ఇదే తొలిసారి. ఆర్బీఐ నిర్ణయంతో బ్యాంక్ రుణాలు మరింత ప్రియం కానున్నాయి.