ఆర్బీఐ కీలక నిర్ణయం.. క్రెడిట్ కార్డులకూ యూపీఐ లింక్ - Telugu News - Mic tv
mictv telugu

ఆర్బీఐ కీలక నిర్ణయం.. క్రెడిట్ కార్డులకూ యూపీఐ లింక్

June 8, 2022

డిజిటల్ పేమెంట్స్ చేస్తున్న వారికి రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) ఓ శుభవార్త చెప్పింది. ఇక నుంచి యూపీఐ అకౌంట్లకు క్రెడిట్ కార్డులను కూడా లింక్ చేసుకునేలా అనుమతి కల్పించనున్నట్టు ఆర్‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. నేడు ప్రకటించిన మానిటరీ పాలసీలో ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ఈ ప్రకటన చేశారు. దేశీయ రూపే క్రెడిట్ కార్డులను తొలుత యూపీఐ అకౌంట్లకు లింక్ చేసుకునేలా అనుమతి ఇస్తామని ఆర్‌బీఐ గవర్నర్ తెలిపారు.

ఆ తర్వాత మాస్టర్‌కార్డు, వీసా వంటి ఇతర క్రెడిట్ కార్డులను కూడా యూపీఐ అకౌంట్లకు అనుసంధానం చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇప్పటి వరకు యూపీఐ అకౌంట్లకు కేవలం డెబిట్ కార్డులను మాత్రమే లింక్ చేసుకునే అనుమతి కస్టమర్లకు ఉండేది. తాజాగా ఈ నిర్ణయంతో డిజిటల్ పేమెంట్లు మరింత పుంజుకోనున్నాయి. కస్టమర్లు మరింత సౌకర్యవంతంగా ఈ పేమెంట్లను చేసుకోనున్నారు.

‘‘యూపీఐ భారత్ లో మరింత సమగ్రమైన చెల్లింపుల విధానంగా అవతరించింది. 26 కోట్ల యూజర్లు, ఐదు కోట్ల వ్యాపారులు ఈ ప్లాట్ ఫామ్ పై నమోదై ఉన్నారు. ఇటీవలి కాలంలో యూపీఐ ఎంతో పురోగతి సాధించింది. తమ దేశంలోనూ ఈ విధానం అమలుకు ఎన్నో దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి’’అని శక్తికాంతదాస్ తెలిపారు.

ఇకపోతే ఆటో డెబిట్‌ లావాదేవీలకు సంబంధించి ఆర్‌బీఐ కీలక ప్రకటన చేసింది. అడిషనల్‌ ఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌ (ఏఎఫ్‌ఏ‌) అవసరం లేని ఆటో డెబిట్ పరిమితిని రూ.5000 నుంచి రూ.15వేలకు పెంచింది. అంటే, ఇకపై వినియోగదారులు ఎలాంటి ఓటీపీ నిబంధన లేకుండానే రూ.15వేల వరకు ఆటో డెబిట్‌గా పెట్టుకోవచ్చు. విద్యుత్‌ బిల్లుల దగ్గర నుంచి గ్యాస్‌ బిల్లుల వరకు నెలవారీ ఖర్చులను చెల్లించేందుకు చాలా మంది డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల లేదా యూపీఐల ద్వారా ‘ఆటో డెబిట్‌ ’ పద్ధతిని ఉపయోగిస్తోన్న విషయం తెలిసిందే.