బ్యాంకు లాకర్లలో మీ డబ్బు భద్రపరచుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఇకపై నగదు భద్రపరచుకోవడం కుదరదు. ఆర్బీఐ కొత్త నిబంధనలకు అనుగుణంగా నడుచుకోకపోతే లాకర్లు సీజ్ చేసే అవకాశం ఉంది. బ్యాంక్ లాకర్లపై ఆర్బీఐ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. లాకర్లు ఉన్న కస్టమర్లు ఎవరరైనా సదరు బ్యాంకుతో కొత్త అగ్రిమెంటు చేసుకోవాలని.. ఇందుకు రూ.200 స్టాంపు పత్రాలపై నోటరీ చేయించి బ్యాంకులో ఇవ్వాలని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.
గడువు తేది డిసెంబర్ 31, 2023
ఈ ఒప్పందం ప్రకారం లాకర్లలో నగదు దాచుకోకూడదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. లాకర్ కేటాయించే సమయంలో వినియోగదారుల పూర్తి వివరాలను నమోదు చేయాలని బ్యాంకులకు సూచించింది. అకౌంట్ హోల్డర్ అడ్రస్ ప్రూఫ్, ఇతర వివరాలు ఏమీ మారలేదని ‘స్వయం ధ్రువీకరణ పత్రం’(సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్) తప్పనిసరిగా తీసుకోవాలని ఆర్‌బీఐ ప్రతి బ్యాంకులకు సూచించింది. ఇందుకోసం బ్యాంకుకు పిలవాల్సిన అవసరం లేదని.. ఈమెయిల్ ద్వారా లేదా ఏటీఎంలో, రిజిస్టర్డ్ సెల్‌ఫోన్ నంబర్ నుంచి, నెట్‌బ్యాంకింగ్ ద్వారా ఆన్‌లైన్‌లో.. ఇలా ఏదైనా డిజిటల్ విధానంలో సేకరించాలని సూచించింది. చిరునామాలో వివరాలేవి మారినా అందుకు సంబంధించిన ఆధార్, ఓటరు కార్డు తదితర గుర్తింపు పత్రాలను సైతం ఆన్‌లైన్ విధానంలో స్వీకరించి.. కేవైసీ వివరాలు అప్‌డేట్ చేయాలని సూచించింది. చిరునామా మారిన వివరాల పత్రాలను కస్టమర్లు ఆన్‌లైన్‌లో పంపితే.. రెండు నెలల్లోగా వెరిఫికేషన్ పూర్తిచేయాలని స్పష్టం చేసింది. అయితే ఆర్బీఐ దశలవారీగా బ్యాంకులకు లక్ష్యాలను పెట్టింది. వచ్చే జూన్ 30కల్లా 50 శాతం, సెప్టెంబరు 30కల్లా 75, డిసెంబరు 31కల్లా 100 శాతం మంది కస్టమర్ల నుంచి పూర్తి చేయాలని స్పష్టం చేసింది.
అవి మాత్రమే దాచాలి
గతంలో పెద్ద నోట్ల రద్దు సమయంలో లాకర్ల నుంచి కట్టలు బయటికి తెచ్చి మార్చుకున్నట్లు అనుమానాలున్న నేపథ్యంలో.. ఆర్‌బీఐ నగదు విషయంలో లాకర్ల నిబంధనల్లో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. లాకర్లలో నగదు నిల్వలను అరికట్టాలని బ్యాంకులకు స్పష్టంచేసింది. లాకర్లలో ఏమేం దాచుకోవాలి, ఏమేం పెట్టకూడదనే అంశాలను స్పష్టంగా పేర్కొంది. లాకర్లలో నగల వంటి విలువైన వస్తువులు, ఇతర పత్రాలు తప్ప మరేవీ దాచకూడదని తెలిపింది. డబ్బులు, డ్రగ్స్, పేలుడు పదార్ధాలు, పాడైపోయే వస్తువులు, చట్టవిరుద్ధ వస్తువులు ఇవన్నీ దాచుకోకూడదని చెప్పింది.
ఈ క్రమంలో కొన్ని బ్యాంకు శాఖలు లాకర్ కేటాయింపు సదుపాయం పొందేందుకు తమ కస్టమర్లను ఏటా చెల్లించాల్సిన నిర్వహణ సొమ్ము(మెయింటైనన్స్ ఫీజు)ను రాబట్టుకోవడానికి అంతమేర వడ్డీ వచ్చేలా ముందుగానే మొత్తాన్ని డిపాజిట్ చేయమని కోరుతున్నాయి.