బ్యాంక్ లాకర్లపై ఆర్బీఐ సరికొత్త నిబంధనలును అమలులోకి తెస్తోంది. జనవరి 1 నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం నిబంధనలను బ్యాంకులు నడుచుకుంటాయి. లాకర్ల విషయంలో బ్యాంకులు పారదర్శకంగా ఉండాలని ఆర్బీఐ సూచించింది. ఇక ఆర్బీఐ కొత్త రూల్స్‌ను ఇప్పుడు ఒక సారి పరిశీలిద్దాం.
కొత్త రూల్స్..
లాకర్ ఒప్పందంలో బ్యాంకులు ఎలాంటి షరతులు చేర్చడానికి వీల్లేదు. అదే సమయంలో బ్యాంకుల ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా కూడా ఉండకూడదు. సురక్షితమైన డిపాజిట్ వాల్ట్లను ఉంచి ప్రదేశాన్ని భద్రంగా ఉంచాల్సిన బాధ్యత బ్యాంకులదే. లాకర్లో దాచిన ఖాతాదారుడి విలువైన వస్తువులు పోతే వాటిని బ్యాంకులే చెల్లించాలి. అదే విధంగా అగ్నిప్రమాదాలు లేదా భవనం కూలిపోవడం వల్ల ఖాతాదారుడి వస్తువులు కోల్పోయినా, నాశనం చేసినా వినియోగదారులు..బ్యాంకు ఛార్జీల కంటే 100 రెట్లు నష్టపరిహారం పొందవచ్చు. లాకర్ రూమ్‌లో కచ్చితంగా సీసీటీవీ కెమెరాలను అమర్చాలి.
వాటి డాటాను 180 రోజుల పాటు జాగ్రత్తగా ఉంచాలి. లాకర్ తెరిచిన ప్రతిసారీ వినియోగదారుడికి ఎస్ఎంఎస్, ఈ-మెయిల్ పంపాలి. కొత్తగా లాకర్ తీసుకునే వినియోగదారుడి నుంచి మూడేళ్ల అద్దె, ఇతర ఖర్చులకు సమానమైన మొత్తాన్ని ఫిక్స్ డ్ డిపాజిట్ చేయాలని బ్యాంకులు కోరవచ్చు. అయితే, ఇది తప్పనిసరి కాదు. ఇప్పటికే లాకర్ సదుపాయం ఉపయోగిస్తున్న వినియోగదారుడి నుంచి పిక్స్ డ్ డిపాజిట్ తీసుకోవాల్సిన అవసరంలేదు. లాకర్ తీసుకున్న వినియోగదారుడు మరణించిన సందర్భంలో మరణ ధ్రువీకరణ పత్రం తీసుకుని, నామినీకి లాకర్ లోని వస్తువులను అప్పగించవచ్చు. వాస్తవానికి ఈ ఏడాది ప్రారంభంలోనే లాకర్ నిబంధనల్లో ఆర్బీఐ పలు మార్పులు సూచించింది.