మహిళల ప్రీమియర్ లీగ్(wpl)కు సర్వం సిద్ధమవుతోంది. వేలాన్ని ఈనెల 13న నిర్వహించగా, షెడ్యూల్ నిన్న(మంగళవారం) విడుదలైంది. మొత్తం 23 రోజులు పాటు జరగనున్న టోర్నీలో ఐదు టీంలు తలపడతాయి. మొదటి మ్యాచ్ మార్చి 4న గుజరాత్ జెయింట్స్-ముంబై ఇండియన్స్ మధ్య జరగనుంది. ఇక టీమ్‌లన్నీ ఆటగాళ్లతో పాటు ఇతర సిబ్బందిని నియమించుకునే పనిలో పడ్డాయి.
ఈసారి సరికొత్తగా..
పురుషుల ఐపీఎల్‌లో జట్లు కోచ్‌లతో పాటు మెంటర్స్‌ను నియమించుకున్నాయి. అంతర్జాతీయ క్రికెట్, ఐపీఎల్‌లో రాణించి.. ఆటకు వీడ్కోలు పలికిన మాజీ ఆటగాళ్లు మెంటర్స్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తమ జట్టుకు విలువైన సలహాలు, సూచనలు అందిస్తున్నారు. మహిళల ప్రీమియర్ లీగ్‌లో కూడా జట్టు యాజమాన్యాలు మెంటర్స్ నియిమించుకుంటున్నాయి. ఈ విషయంలో రాయల్ చాలెంజర్స్ మాత్రం సరికొత్త సంప్రదాయనికి తెరలేపింది. టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను ఆర్సీబీ తమ మెంటర్‌గా నియిమించింది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. మొదటసారి క్రికెటేతర ప్లేయర్‌కు బాధ్యతలను అప్పగించింది ఆర్సీబీ.
సానియా పర్ఫెక్ట్
సానియాకు ఆర్జీబీ యాజమాన్యం తమ కుటుంబంలోకి స్వాగతం పలికింది. ఈ మేరకు ట్విట్టర్‌లో సానియా మీర్జా కోసం రాసుకొచ్చింది.” మా కోచింగ్ సిబ్బంది క్రికెట్‌కు సంబంధించిన వ్యవహారాలు చూసుకుంటుంది. కఠిన పరిస్థితులు, ఒత్తిడిని జయించడం, ఆటగాళ్ల మానసికస్థితిపై సానియా సేవలను అందించనుంది. చాంపియన్ అథ్లెట్, అవరోధాలు అధిగమించి దిగ్గజ ప్లేయర్‌గా ఎదిగిన వ్యక్తిని మా మెంటర్‌గా నియమించాం. మా కుటుంలోకి ఆమెకు స్వాగతం పలుకుతున్నాం. ఇంతకంటే గొప్ప వ్యక్తి మరొకరు దొరకరు” అంటూ ఆర్సీబీ ట్వీట్ చేసింది. ఇటీవల సానియా మీర్జా తన టెన్నిస్ కెరీర్‌కు వీడ్కోలు పలికింది. ఇప్పుడు క్రికెట్ రంగంలో అడుగుపెట్టి కొత్త బాధ్యతలను నిర్వహించేందుకు సిద్ధమైంది.