పెగాసస్‌పై దేనికైనా సిద్ధం: లోకేశ్ - MicTv.in - Telugu News
mictv telugu

పెగాసస్‌పై దేనికైనా సిద్ధం: లోకేశ్

March 21, 2022

lokesh

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పెగాసెస్ వ్యవహారం దుమారం రేపింది. ఈ సందర్భంగా సోమవారం వైసీపీ సభ్యుల వినతితో స్పీకర్‌ పెగాసస్‌ వ్యవహారంపై హౌస్‌ కమిటీ వేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి మరో రెండు మూడు రోజుల్లో శాసనసభ కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. అయితే, పెగాసస్‌పై టీడీపీ సభ్యుల్లో ఆందోళన ఉందని ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి అన్నారు. వెంటనే టీడీపీ నేత, ఎమ్మెల్సీ నారా లోకేష్ స్పందిస్తూ..”పెగాసెస్‌పై హౌస్ కమిటీకైనా, జ్యూడిషియరీ కమిటీకైనా, సీబీఐ విచారణకైనా, దేనికైనా నేను సిద్దం. బాబాయ్ హత్య విషయంలోనూ, మద్యం మరణాల విషయంలోనూ విచారణ వేయగలరా? మమతా బెనర్జీ అసెంబ్లీలో మాట్లాడారో? లేదో ఇప్పటికీ క్లారిటీ లేదు. బెంగాలీలో మాట్లాడిన వీడియోలో పెగాసెస్ ప్రస్తావన కూడా లేదు” అని బెంగాలీ తెలిసిన తన స్నేహితుడు చెప్పాడంటూ లోకేశ్ పేర్కొన్నారు.

అంతేకాకుండా వ్యక్తిగత విషయాలు వినే అలవాటు తమకెవరికీ లేదన్నారు. ఈ అలవాటు అంబటి రాంబాబుకు ఉందేమోనని, అందుకే ఆయన రాసలీలలు బయటపడ్డాయంటూ విమర్శించారు. ఐదు రోజులుగా మద్యం, కల్తీసారా మరణాలపై పోరాడుతున్నామని.. సారా మరణాలను సహజ మరణాలుగా సీఎం తీసిపారేయడం బాధాకరమంటూ లోకేష్ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కల్తీసారా వల్ల మొత్తంగా 42 మంది చనిపోయారన్నారు. ఏపీ ప్రభుత్వం సరఫరా చేసే మద్యం బ్రాండ్లు అన్ ఫిట్ ఫర్ హ్యూమన్ కన్సప్షన్ అంటూ లోకేష్ మండిపడ్డారు.

మరోపక్క పెగాసస్‌ వ్యవహారంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇటీవలే సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. “ఏపీలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేశారు. నాలుగైదేళ్ల క్రితం పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను రూ.25 కోట్లకు విక్రయిస్తామంటూ, దాని సృష్టికర్తలు బెంగాల్ పోలీసులను సంప్రదించారు. ఆ విషయం తెలిసిన వెంటనే నేను తిరస్కరించాను. ఆ సమయంలో చంద్రబాబు ప్రభుత్వం దానిని కొనుగోలు చేసింది’ అని ఆమె అన్నారు.