సాహితీ రియల్ ఎస్టేట్.. ఇలాంటి దగా కంపెనీలు ఎన్నెన్నో.. - MicTv.in - Telugu News
mictv telugu

సాహితీ రియల్ ఎస్టేట్.. ఇలాంటి దగా కంపెనీలు ఎన్నెన్నో..

December 3, 2022

కోట్లకు పడగలెత్తడానికి చక్కని దారి, అడ్డదారి రియల్ ఎస్టేట్. సామాన్యుల సొంతింటి కలనే తమ పెట్టుబడిగా భావించి భారీ మోసాలకు పాల్పడుతున్న రియల్ ఎస్టేట్ కంపెనీల ఆగడాలు మితిమీరుతున్నాయి. ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోకపోవడంతో దోషులు మహారాజుల్లా దర్జాగా తిరుగుతున్నారు. కొన్ని కేసుల్లో అరెస్టయినా, జైలు అత్తారింటికి వెళ్లినట్లు వెళ్లి వచ్చేస్తున్నారు. హైదరాబాద్‌లో తాజాగా అరెస్టయిన సాహితీ ఇన్‌ఫ్రాటెక్ అధినేత బూదాటి లక్ష్మీనారాయణ కూడా చట్టాల్లోని లొసుగుల ఆసరాతో రేపోమాపో బయటికి వచ్చేయొచ్చు.

గాలిమేడలు..

ప్రీలాంచ్ ఆఫర్ పేరుతో 2,500 మంది నుంచి రూ. 900 కోట్లు వసూలు చేసి, బోర్డు తిప్పేసిన లక్ష్మీనారాయణ లాంటి మోసగాళ్లు, కంపెనీలు చాలానే ఉన్నాయి. సాహితి కంపెనీ సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో 23 ఎకరాల్లో 38 అంతస్తులతో భారీ ప్రాజెక్టు నిర్మిస్తున్నామని చెప్పి మోసం చేసింది. కేవలం అపార్టుమెంట్లే కాకుండా, ఇళ్ల స్థలాలు, శ్రీగంధం చెట్లు, రిస్టార్టులు, ఫామ్ హౌసులు వంటి వాటిపేరుతో రియల్ ఎస్టేట్ రంగంలో భారీ మోసాలు జరుగుతున్నాయి. కొన్ని కంపెనీలకు బడా నేతల నుంచి అండదండలు పుష్కలంగా ఉండడంతో దోషులకు భయమే లేకుండా పోతోంది. వాటికి ప్రముఖ రాజకీయ నేతలతో బలమైన సంబంధాలున్నాయి. చాలా కేసుల్లోని బాధితుల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు ఎన్నారైలతోపాటు పోలీసులు కూడా ఉన్నారంటే ఎంత పక్కాగా మోసం చేస్తున్నారో ఊహించుకోవచ్చు. ఐటీ, రెవిన్యూ అధికారులు దాడులు జరిపి, కేసులు పెట్టినా చాలా కంపెనీ దర్జాగా వ్యాపారం చేస్తూనే ఉన్నాయి. బూదాటి లక్ష్మీనారాయణ తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలకమండలి సభ్యుడిగా ఎన్నికయ్యాడంటే అతని పలుకుబడి ఏమిటో అర్థం చేసుకోవచ్చు.

ఏపీలోనూ..

ఇటీవల కాలంలో తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ రియల్ ఎస్టేట్ మోసాలు చాలానే జరిగాయి. విజయవాడకు చెందిన ఎంకే కనస్ట్రక్షన్స్‌ అండ్‌ డెవలపర్స్‌ గత ఏడాది జనం నుంచి రూ. 6 కోట్ల సొమ్ము దండుకుని బోర్డు తిప్పేసింది. గన్నవరంతోపాటు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తమకు వెంచర్లు ఉన్నాయని జనం నుంచి అడ్వాన్సు కింద లక్షల సొమ్ము తీసుకుని ముఖం చాటేసింది. గుంటూరు కేంద్రంగా పనిచేసిన విజయసారథి హౌసింగ్‌ సంస్థ 184 మంది కొనుగోలుదారుల నుంచి 7 కోట్ల రూపాయలు దండుకుని మొండిచేయి చూపింది. తెలంగాణలో ప్రతిభ రియల్ ఎస్టేట్ కంపెనీ, రియల్ లైఫ్ ఇన్‌ఫ్రా మరెన్నో కంపెనీలు ప్రజలకు కుచ్చుటోపీ పెడుతున్నాయి. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఆకర్షణీయమైన వెంచర్లు, ప్రీలాంచ్ ఆఫర్ల పేరుతో జనం సొమ్మును దోచుకుంటున్న ఇలాంటి కంపెనీలపై కఠిన చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడమే లేదు. ప్రజలు వీటి మోసాలకు దూరంగా ఉండాలంటే చాలా అప్రమత్తంగా ఉండాలి. స్థలం, ప్లాటు మరేదైనా ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు ఉన్న కంపెనీల నుంచే కొనాలి. జీహెచ్ఎంసీ, డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ, సంబంధింత మునిసిపాలిటీల, గ్రామపంచాయతీల అనుమతులు, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించాలి.