ఆయన పాడితే గాలి కూడా గొంతు కలుపుతుంది... - MicTv.in - Telugu News
mictv telugu

ఆయన పాడితే గాలి కూడా గొంతు కలుపుతుంది…

August 12, 2017

ఆయన పాడితే గాలి కూడా గొంతు కలుపుతుంది..ఆయన గజ్జె కడితే పల్లె పరవశిస్తుంది..ఆయన ఒగ్గు కథ చెపితే ముక్కోటి దేవతలూ కొలువై వింటారు..ఆయనే ఒగ్గు కథా చక్రవర్తి మిద్దె రాములు..అసమాన ప్రతిభతో ఒగ్గు కథకే వన్నె తెచ్చిన మిద్దె రాములుని స్మరించుకుందాం.
ఒగ్గు కథ అంటే మిద్దె రాములు…మిద్దె రాములంటే ఒగ్గు కథ..గానం,నృత్యం,నాటకాల మిశ్రమమైన తెలంగాణ సాంస్కృతిక వైభవం ఒగ్గుకథను ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లిన జానపద బ్రహ్మ మిద్దె రాములు.. కరీంనగర్ జిల్లా హన్మాజీపేటలో 1941 లో జన్మించిన రాములు..పేదరికంతో సరిగ్గా చదువుకోలేకపోయాడు..చిన్నతనంలోనే కూలి పనులకు వెళ్లాడు.

ఒకసారి జాతరలో గొల్ల కుర్మలు చెప్పిన ఒగ్గుకథను విన్న రాములు దానికి అభిమాని అయ్యాడు..ఎలాగైనా ఒగ్గును నేర్చుకోవాలనుకున్నాడు..ఒగ్గు కళాకారులను ఒప్పించి వాళ్లలో ఒకడిగా చేరాడు.. వాళ్లతో పాటే ఊరూరూ తిరిగి ఆ కళారూపాన్ని ఒంటపట్టించుకున్నాడు..రాగంతో పాటు నృత్యం కూడా ఒగ్గులో ప్రధానం..ఇందులో ప్రావీణ్యం సంపాదించడానికి ప్రతీక్షణం తాపత్రయపడ్డాడు.. అయితే గజ్జెలు కొనుక్కోవడానికి కూడా పైసలు లేకపోవడంతో కాళ్లకు తుమ్మకాయలు కట్టుకునేవాడు..ఆముదపు దీపం నీడలో తన కదలికల్ని గమనించేవాడు..ఏమైనా తప్పులుంటే సవరించుకునేవాడు..అకుంఠిత దీక్ష, పట్టుదలతో ఒగ్గుకథలో తనకంటూ ప్రత్యేక శైలిని రూపొందించుకున్నాడు.

పురాణాల మీద పట్టుతో అశువుగా ఎన్ని కథలైన చెప్పేవాడు రాములు..సరిగ్గా చెపితే నాలుగురోజులైనా ఆయన చెప్పే ఒగ్గు కథ ఒడ్వదు..మిద్దె రాములు ఒగ్గు చెప్పుతుంటే ప్రేక్షకులు తన్మయత్వంతో చూసేవారు.కథ కంటే దాన్ని చెప్పడానికి రాములు అనుసరించిన విధానమే అద్భుతంగా ఉంటుంది..బోనం ఎత్తుకుని వేప మండలు పట్టుకుని మిద్దె రాములు ఎల్లమ్మ కథ చెపుతుంటే ప్రేక్షకుల రోమాలు నిక్కబొడిచేవి..నెత్తి మీద బోనంతో కింద ఉన్న పైసల్ని నోటితో అందుకోవడంలో రాముల్ని మించినోరు లేరు..

ఒకసారి కరీంనగర్ కు నాటి ప్రధాని ఇందిరాగాంధీ వచ్చారు..సర్కస్ గ్రౌండ్ లో రాత్రి ఎనిమిదింటికి సభ..అయితే పదింటి వరకు ఇందిర రాలేదు…అప్పుడు రాములు కథ చెప్పడం మొదలుపెట్టాడు…అది ఇందిరాగాంధీ సభ అన్న సంగతే ప్రజలు మరిచిపోయారు..రాత్రి ఒంటిగంట వరకు రాములు కథ చెప్పారు..అంత సేపు గ్రౌండ్ లో జనం కదలకుండా ఉన్నారు సంప్రదాయకళలు కనుమరుగవుతోన్న దశలో ఒగ్గు కథను సజీవంగా తిరిగి నిలబెట్టిన కళాకారుడు మిద్దెరాములు. తెలంగాణ పల్లెల్లో రాములు కథ వినని వారూ ఎవరూ ఉండరు..యాభై ఏళ్ల పాటు ముప్పై వేల ప్రదర్శనిలిచ్చాడు జాతరలు,శుభకార్యాలతో పాటు జనాభా నియంత్రణ,వయోజన విద్య,అక్షరాస్యత కార్యక్రమాలను ప్రభుత్వం తరపున ప్రచారం చేశాడు…ఆకాశవాణి,దూరదర్శన్ లో దాదాపు రెండువందల ప్రదర్శనలిచ్చాడు.. కరీంనగర్,మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో ఆయన శిష్యులు రెండు వేల మందికి పైగా ఉన్నారు..

ఇంటర్ స్టేట్ కల్చరల్ ఎక్సైంజ్ ప్రోగ్రాంలలో పాల్గొన్న రాములు తెలంగాణ ఖ్యాతిని దశదిశిలా వ్యాప్తి చేశాడు.. 1990లో మారిషస్ లో జరిగిన మూడవ ప్రపంచ తెలుగు మహాసభల్లో ఒగ్గు కథను ప్రదర్శించి ప్రేక్షకులకు మరిచిపోలేని అనుభూతినిచ్చాడు…అప్పటి మారిషస్ ప్రధాని అనురుధ్ జగన్నాథ్,గవర్నర్ రంగస్వామి ప్రశంసలు అందుకున్నాడు..ఒగ్గుకథకు రాములు చేస్తున్న కృషిని ఎన్నో సంస్థలు మెచ్చుకున్నాయి..జానపద కళా బ్రహ్మ,ఒగ్గు కథా చక్రవర్తి,కళాపురస్కార్ బిరుదుల ఇచ్చి గౌరవించాయి..రాజీవ్ గాంధీ, అంజయ్య,చంద్రబాబు ముందు ప్రదర్శనలిచ్చి ప్రశంసలందుకున్నాడు..ఒగ్గులో రాములు గొప్పతనాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం కల్చరల్ కౌన్సిల్ మెంబర్ గా నామినేట్ చేసింది.

ఒగ్గు కథను ప్రపంచవేదికపై సగర్వంగా నిలిపిన మహానీయుడు మిద్దెరాములు..చివరివరకు ఒగ్గే శ్వాసగా బతికిన రాములు..2010 నవంబర్ 25 న చనిపోయారు…కళాకారులకు మరణం ఉండదు..కళారూపాల్లో వాళ్లు ఎప్పటికీ సజీవంగా ఉంటారనడానికి రాములే సాక్ష్యం..ఎక్కడ ఒగ్గు కథ చెప్పినా..అక్కడ రాములు జ్ఞాపకాలే కనిపిస్తాయి..