మసూద్‌పై చైనాకు ప్రేమా? భయమా? ఇదీ సంగతి! - MicTv.in - Telugu News
mictv telugu

మసూద్‌పై చైనాకు ప్రేమా? భయమా? ఇదీ సంగతి!

March 14, 2019

భారత్‌లో నరమేధాలకు పాల్పడుతున్న కరడుగట్టిన ఉగ్రవాది మసూద్ అజర్‌కు చైనా మళ్లీ కొమ్ముకాసింది. ఐక్యరాజ్యసమితిలో అండగా నిలిచింది. అతనిపై నిషేధం, ఇతర కఠిన చర్యల కోసం భారత్‌కు సాయంగా బ్రిటన్, ఫ్రాన్స్‌, అమెరికాలు తీసుకొచ్చిన తీర్మానాన్ని వీటో చేసింది. మసూద్‌కు చైనా ఇలా ఐరాసలో రక్షణ కవచంగా నిలవడం ఇది మూడోసారి. మరి ప్రపంచమంతా అసహ్యించుకుంటున్న మసూద్ విషయంలో చైనా ఇందుకిలా వ్యవహరిస్తోంది. చైనాకు అతడంటే ప్రేమా? లేక భయమా?

Reasons for china support to jaish e mohammad chief masood azhar  in regional and influential angels with india and Pakistan in UNO

మసూద్ విషయంలో చైనా తీరును అర్థం చేసుకోవాలంటే దాని ప్రాంతీయ వ్యూహాలను అర్థం చేసుకోవాలి. దాని స్వార్థాన్ని, ఆందోళనను తెలుసుకోవాలి. చైనాకు భారత్ అంటే పడదని కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అందుకే భారత్‌కు బద్ధశత్రువైన పాకిస్తాన్‌తో దోస్తీ చేస్తోంది. పాక్, అఫ్ఘానిస్తాన్‌లతోపాటు తన సరిహద్దు ప్రాంతంలోని ఉయ్‌గుర్ ముస్లింల వ్యవహారం, భారత్‌లో తలదాచుకుంటున్న దలైలామాపై ద్వేషం.. అన్నీకలిపి.. మసూద్‌కు చైనాను ఒక కవచంగా మార్చాయి.  

దలైలామా, ప్రాంతీయ ఆధిపత్యం, భయం..

టిబెట్‌పై చైనా ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తున్న దలైలామాకు ఏడు దశాబ్దాలుగా భారత్‌లో ఉంటున్నారు. భారత్ నుంచి టిబెట్ ప్రవాస ప్రభుత్వం కూడా నడుస్తోంది. ఇది చైనాను సహజంగానే ఇబ్బంది పెట్టే విషయం కావడంతో భారత్‌ను ఇరుకున్న పెట్టేందుకు మసూద్‌ను వెనకేసుకొస్తోంది. పాకిస్తాన్‌తో కలిసి ప్రారంభించిన ఆర్థిక కారిడార్ కూడా మరో కారణం. ఇది పాక్ భూభాగం గుండా వెళ్తుంది. మసూద్‌ను ఇబ్బంది పెడితే అక్కడి ఉగ్రవాదులు దీనికి ఆటంకం కలిగిస్తారు.  

మరోపక్క.. చైనాలో కొన్నేళ్లుగా ఉగ్రవాద దాడులు పెరుగుతున్నాయి. జిన్‌జియాంగ్‌ రాష్ట్రంలో ఉయ్‌గుర్ ముస్లింలు తిరగబడుతున్నారు. వారిపై కమ్యూనిస్టు సర్కారు ఉక్కుపాదం మోపుతోంది. ఆ ప్రాంతం అఫ్ఘాన్‌కు సరిహద్దులోనే ఉంది. మసూద్ సారథ్యంలోని జైషే ఉగ్రవాదులు అఫ్ఘాన్‌లో పెద్ద సంఖ్యలో ఉన్నారు. మసూద్‌పై చర్యలకు మద్దతు పలికితే వారు చైనాపై దాడులకు తెగబడతారు. పాకిస్తాన్‌తోపాటు ముస్లిం దేశాల నుంచి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇటీవల బలపడుతున్న వియత్నాం, భారత్ సంబంధాలు కూడా చైనాకు కంటగింపుగా మారాయి. భారత్ వియత్నాంకు ఆయుధాలు అమ్మడం చైనా అన్నయ్యకు ఇష్టం లేదు. శ్రీలంక, మారిషస్ వంటి దక్షిణాసియాలోని చిన్నచిన్న దేశాలతో భారత్ సంబంధాలు పెంచుకుంటే తన ప్రభావం తగ్గింపోతుందని దాని భయం. ఇలా ప్రతికోణంలో తన ప్రయోజనాల పరిక్షణ కోసం చైనా మసూద్ విషయంలో అడ్డుపుల్లు వేస్తోంది.