ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్ ఊరిలో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. వందలాది ఇళ్లు బీటలు వారి, భూమి ఏనుగులు తొక్కినట్టు కుంగిపోతుండడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రకృతి విపత్తులు, మానవ తప్పిదాలు దీనికి కారణమని భావిస్తున్నా స్పష్టమైన కారణాలు ఇంతవరకు బయటికి రాలేదు. ఈ విషయాన్ని అధ్యయనం చేసిన ప్రముఖ శాస్త్రవేత్త కాలాచంద్ సైన్ ఊరు కుంగడానికి కారణాలు శాస్త్రీయంగా విశ్లేషించారు. ఆయన వాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీకి డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.
ఒక్కటి కాదు..
‘‘జోషీమఠ్ కుంగడానికి కారణాలు చాలా ఉన్నాయి. వందేళ్ల కిందట భూకంపం వల్ల విరిగిపడిన కొండచరియలపై ఈ ఊరిని నిర్మించారు. ఇది తరచూ భూకంపాలు వచ్చే v సిస్మిక్ జోన్లో ఉంది. నేలకింద జలప్రవాహాలు, ఇతర ప్రతికూల వాతావరణ పరిస్థితులు కొన్ని దశాబ్దాలుగా సాగుతున్నాయి. ఫలితంగా లోపలి శిలల పటుత్వం దెబ్బతింది. రుషిగంగ, ధౌలిగంగ వరదలు, కుంభవృష్టి వల్ల కూడా ఊరిని దెబ్బతీశాయి. మౌలిక వసతుల కోసం పలు భారీ ప్రాజెక్టులు చేపట్టడం కూడా ఒక కారణం. హోటళ్లు, రెస్టారెంట్లు తామరతంపరగా పెరిగాయి. ఈ పరిస్థితిలో జోషిమఠ్ ఆవాస యోగ్యం కాదు. అక్కడి ప్రజలను శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలించడమే మార్గం..’’ అని వివరించారు కాలాంచంద్.