బీజేపీ సీఎం పీఠానికి ఎసరు.. తిరగబడ్డ ఎమ్మెల్యేలు! - MicTv.in - Telugu News
mictv telugu

బీజేపీ సీఎం పీఠానికి ఎసరు.. తిరగబడ్డ ఎమ్మెల్యేలు!

October 12, 2020

Rebellion against Tripura CM Biplab Deb

త్రిపుర బీజేపీ సీఎం బిప్లబ్ ‌కుమార్‌ దేబ్‌కు సొంత పార్టీలో వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఆయన్ను సీఎం పదవి నుంచి తొలగించాలంటూ 12 మంది ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు వారు ఢిల్లీలో త్రిపుర భవన్‌లో ఉంటూ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ 12మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలకు సుదీప్‌ రాయ్‌ బర్మన్‌ నాయకత్వం వహిస్తున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడిని కలిసిన తరువాత వారంతా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను కూడా కలువనున్నట్టు తెలుస్తోంది.

ఈ సందర్భంగా తిరుగుబాటు ఎమ్మెల్యేల నాయకుడు సుదీప్‌ రాయ్‌ బర్మన్‌ మాట్లాడుతూ..’రాష్ట్రంలో జరుగుతున్న పాలన గురించి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నాం. సీఎం అనుచిత వ్యాఖ్యలతో పార్టీని అనేక సార్లు ఇబ్బందుల్లో పడేశారు. సీఎం నియంతృత్వ స్వభావాన్ని భరించలేక ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు డిప్యూటేషన్‌ వెళ్లిపోతున్నారు. కొందరు సీనియర్ అధికారులు స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తున్నారు. మేమంతా పార్టీ నిర్ణయాలకు కట్టుబడి పని చేస్తున్నాం. రాష్ట్రంలో భవిష్యత్‌లో కూడా బీజేపీ అధికారంలో రావాలంటే నాయకత్వ మార్పు అవసరం.’ అని అన్నారు. త్రిపురలో బీజేపీ, దాని మిత్రపక్షం ఇండిజీనస్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ త్రిపుర(ఐపీఎఫ్‌టీ) 2018లో అధికారంలోకి వచ్చింది. 60 అసెంబ్లీ స్థానాలున్న త్రిపురలో 36 స్థానాల్లో బీజేపీ, 8 స్థానాల్లో ఐపీఎఫ్‌టీ పార్టీలు గెలుపొందాయి.