2 రోజుల్లో రూ. 242 కోట్లు తాగేశారు..కర్ణాటక బ్యాచ్ సీన్!
లాక్ డౌన్ లోనూ మద్యం అమ్మకాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెల్సిందే. దీంతో గత మూడు రోజులుగా దేశవ్యాప్తంగా మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. ఎక్కడ చూసినా వైన్ షాపులు మందుబాబులతో కిటకిటలాడుతున్నాయి. మద్యంప్రియులు మండుటెండులను సైతం లెక్క చెయ్యడం లేదు. గంటల తరబడి నిలబడి మరీ మద్యం బాటిళ్లు కొంటున్నారు. దీంతో కొన్ని రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో తొలిరోజు 67 కోట్ల మద్యం అమ్మకాలు జరుగగా. తెలంగాణలో 90 కోట్ల అమ్మకాలు జరిగాయి.
ఈ క్రమంలో మద్యం అమ్మకాల్లో కర్ణాటక రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. కర్ణాటకలో తొలి రోజే రూ.45కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. రెండో రోజు ఏకంగా రూ.197 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. కర్నాటక రాష్ట్రంలో ఇప్పటివరకు అదే రికార్డ్. ఆ రికార్డ్ ఇప్పుడు తుడిచి పెట్టుకుపోయింది. కర్నాటక తర్వాత ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఉంది. యూపీలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. రాష్ట్రంలో ఒక రోజులోనే వంద కోట్ల రూపాయల లిక్కర్ సేల్స్ జరిగాయి. మహారాష్ట్రలో రెండో రోజు రూ.62 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. కేరళ ప్రభుత్వం మాత్రం మద్యం అమ్మకాలకు అనుమతి ఇవ్వలేదు.