తెలంగాణ రాష్ట్రంలో ఎర్ర బంగారం (మిర్చి) ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. రైతులకు, వ్యాపారులకు కాసుల పంటను కురిపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా క్వింటాల్ మి ర్చి ధర ఏకంగా రూ.44 వేల మార్కును దాటింది. గురువారం వరంగల్లోని ఎనుమాముల మార్కెట్లో దేశీయ రకం మిర్చికి రూ.44 వేల ధర దక్కింది. సింగిల్ పట్టీ రకం మిర్చి కూడా రికార్డు స్థాయిలో రూ.42,500 ధర పలికింది. దీంతో మిర్చి రైతుల కళ్లల్లో ఆనందం వెల్లివిరిస్తోంది. నిత్యం నష్టాలపాలయ్యే మిర్చి రైతులకు రికార్డు స్థాయిలో పలుకుతున్న ధరలు ఆనందాన్ని కలిగిస్తున్నాయి.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ దేశంలోనే అతిపెద్ద మార్కెట్. ఈ మార్కెట్కు ఎక్కువ మొత్తంలో మిర్చిని విక్రయించేందుకు రైతులు వస్తూ ఉంటారు. రెండో కోత చేతికి రావడంతో రైతులు పంటను మార్కెట్కు పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. గతేడాది ఎకరాకు 20 నుంచి 30 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. కానీ ఈ సంవత్సరం ఎకరాకు 10 క్వింటాల్ దిగుబడి రావడమే గగనమైంది. కొన్ని చోట్ల అయితే ఎకరాకు 4,5 క్వింటాల్ మాత్రమే దిగుబడి వచ్చింది. కాగా ఇతర దేశాలకు మిర్చిని ఎగుమతి చేస్తున్నందున ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.