Red alert at Kadem project in telangana
mictv telugu

కడెం ప్రాజెక్టు వద్ద రెడ్ అలర్ట్.. 12 గ్రామాల ప్రజలు తరలింపు

July 13, 2022

వారం రోజులుగా భారీగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టుల్లోకి వరద పోటెత్తుతోంది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా కుంటలు, చెరువులు నిండాయి. ఈ క్రమంలో తెలంగాణ నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు భారీ వరద వచ్చి చేరుతోంది. నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా, నీటి నిల్వ సామర్ధ్యం 7.603 టీఎంసీలు. 17 గేట్లు ఎత్తి రెండు లక్షల 50 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. అయితే అవుట్ ఫ్లో కన్నా ఇన్ ఫ్లో ఎక్కువ ఉండడంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. నీరు ఎక్కువై ప్రాజెక్టు కట్ట మీది నుంచి ప్రవహిస్తుండడంతో రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఒకవేళ వరద ఇంకా పెరిగితే కట్ట తెగిపోయే ప్రమాదం ఉండడంతో అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో అప్రమత్తమై ముందు జాగ్రత్తగా ప్రాజెక్టు పరిధిలో ఉన్న 12 గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ చర్యలను మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, రేఖానాయక్, కలెక్టర్, ఎస్పీ, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు దగ్గరుండి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.