నేరం వారి పాలిట మరణపాశంగా మారింది. నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లు రోడ్డు ప్రమాదంలో సజీవదహనమయ్యారు. కడప ఎయిర్ పోర్ట్ దగ్గర ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ రోజు తెల్లవారుజామున టిప్పర్ను రెండు కార్లు ఢీకొట్టాయి. సుమో వాహనంలోని నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లు సజీవ దహనమై అక్కడికక్కడే చనిపోగా మరో నలుగురు గాయపడ్డారు. మృతులను తమిళనాడకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్లుగా గుర్తించారు.
తాడిపత్రి రహదారిపై గోటూరు, తోళ్లగంగన్నపల్లె మధ్యలో ఈ ప్రమాదం జరిగింది. స్మగ్లర్లు ప్రయాణిస్తున్న సుమో వాహనం మరో కారును ఓవర్ టేక్ చేయబోయి టిప్పర్ను ఢీకొట్టింది. వెనక వస్తున్న కారు ఈ రెండు వాహనాలను ఢీకొట్టింది. సుమో.. టిప్పర్ డీజిల్ ట్యాంకును బలంగా గుద్దుకోవడంతో పెద్ద ఎత్తున మంటలు లేచాయి. టిప్పర్తోపాటు రెండు కార్లు బూడిదయ్యాయి. సుమోలో ఉన్న నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లు లోపలే కాలిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు క్షతగాత్రులను కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.