మరో వారంలో వంటనూనె ధరలు తగ్గింపు: కేంద్రం - MicTv.in - Telugu News
mictv telugu

మరో వారంలో వంటనూనె ధరలు తగ్గింపు: కేంద్రం

July 7, 2022

కేంద్ర ప్రభుత్వం వంటనూనెలను తయారు చేసే సంస్థలకు ఓ విజ్ఞప్తి చేసింది. వంటనూనె ధరలను తగ్గించాలని తయారీ సంస్థలను కోరింది. అంతర్జాతీయ ధరల పతనం కారణంగా దిగుమతి చేసుకున్న వంటనూనెల ఎంఆర్పీ ధరలను వారంలోగా లీటర్‌కు రూ.10 తగ్గించాలని సూచించింది. అదేవిధంగా ఒకే బ్రాండ్ నూనెలపై ఒకే విధమైన ఎంఆర్పీ ఉండేలా చూడాలని పేర్కొంది. అంతర్జాతీయ ధరలు తగ్గిన సందర్భంగా ఆహార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుదాన్సు పాండే వంటనూనెల తయారీదారుల అసోసియేషన్లతో బుధవారం సమావేశం నిర్వహించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ..”ప్రస్తుత పరిస్థితులపై, ఎంఆర్పీ తగ్గింపు విషయంలో చర్చలు జరిపాం. గతవారం వ్యవధిలో అంతర్జాతీయంగా ధరలు 10 శాతం వరకు తగ్గాయి. దానికి అనుగుణంగా ధరలను, ఎంఆర్పీలను తగ్గించాలని తయారీ సంస్థలను కోరాం. దీనికి వారు వారంలోపు పామాయిల్, సోయాబీన్, సఫ్లవర్ ఆయిల్‌పై రూ.10 వరకూ తగ్గిస్తామని మెజార్టీ తయారీదారులు హమీ ఇచ్చారు. వంటనూనె అవసరాల్లో 60 శాతానికిపైగా మన దేశం దిగుమతి చేసుకుంటుంది. ప్రపంచ మార్కెట్లో నెలకొన్న పరిస్థితుల కారణంగా నూనెల ధరలు గతకొన్ని నెలలుగా భారీగా పెరిగాయి. కొద్ది రోజులుగా అంతర్జాతీయ ధరలు తగ్గుతూ వచ్చాయి” అని ఆయన అన్నారు.

మరోపక్క వంటనూనెల తయారీదారులు గత నెలలో లీటరు రూ.10-15 తగ్గించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రష్యా, ఉక్రెయిన్ యద్ధం కారణంగా వంటనూనెలతోపాటు నిత్యావసరాల ధరలు సైతం పెరిగాయి. దాంతో సామాన్యులు నేటీకి అవస్థలు పడుతూనే ఉన్నారు. అంతర్జాతీయ ధరలు తగ్గుతూ వస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం మరోసారి వంటనూనెలపై రూ.10 వరకు తగ్గించాలని తయారీ సంస్థలను కోరింది.