పోలీస్, గ్రూప్ 1 ఉద్యోగాలకు ఫీజులు తగ్గించండి: అభ్యర్థులు - MicTv.in - Telugu News
mictv telugu

పోలీస్, గ్రూప్ 1 ఉద్యోగాలకు ఫీజులు తగ్గించండి: అభ్యర్థులు

May 4, 2022

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలే విడుదలైన పోలీస్‌, గ్రూప్ 1 ఉద్యోగాల విషయంలో అభ్యర్థులు నానా అవస్థలు పడుతున్నారు. ఓవైపు ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చిందన్న ఆనందం కంటే, దరఖాస్తులకు కేటాయించిన ఫీజులు కట్టలేకపోతున్నామని అభ్యర్థులు అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. విడుదలైన ఉద్యోగాలకు సోమవారం నుంచి ఆల్‌లైన్‌లో దరఖాస్తులు ప్రారంభంకావడంతో అభ్యర్థులు ఫీజులు చెల్లించలేక, తక్షణమే దరఖాస్తుల ఫీజులు తగ్గించాలని అధికారులను వేడుకుంటున్నారు.

రాష్ట్రంలోని ఆరు ప్రభుత్వ విభాగాల్లో 17,294 పోస్టుల భర్తీకి పోలీస్‌ నియామక మండలి ప్రకటనలు విడుదల చేసిన విషయం తెలిసిందే. అందులో 10 రకాల పోస్టులకు వేర్వేరుగా ఫీజులను అధికారులు నిర్ణయించారు. ఎస్సై పోస్టులకు ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.1000, ఎస్సీ, ఎస్టీలకు రూ.500లుగా కేటాయించారు. కానిస్టేబుల్‌ పోస్టులకు ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.800, ఎస్సీ, ఎస్టీలకు రూ.400 ఫీజుగా నిర్ణయించారు. అన్ని రకాల పోస్టులకు ఓసీ, బీసీ అభ్యర్థులు దరఖాస్తు చేయాలంటే మొత్తం రూ.8800 చెల్లించాల్సి వస్తోంది. మరోవైపు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.4400 చెల్లించాల్సి వస్తోంది.

ఈ క్రమంలో కొంతమంది అభ్యర్థులు మాట్లాడుతూ..”కరోనా వల్ల మా కుటుంబాలు ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తిన్నాయి. అప్పులు తెచ్చుకోని కోచింగ్‌లకు వెళ్తున్నాం. హైదరాబాద్‌లో హాస్టల్ ఫీజులు విపరీతంగా పెంచారు. అన్నీ పోస్టులకు అర్హతలున్నాయి. కానీ అధికంగా ఫీజుల ఉండడంతో దరఖాస్తు చేసుకోలేకపోతున్నాం. దయచేసి పోస్టుల వారీగా ఫీజులను తగ్గించండి” అని అధికారులను వేడుకుంటున్నారు. టీఎస్‌పీఎస్సీ ద్వారా రాష్ట్రస్థాయి అత్యున్నత సివిల్‌ కేడర్‌ పోస్టులయిన గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇస్తే, దరఖాస్తులకు రూ.200 మాత్రమే వసూలు చేస్తారని అభ్యర్థులు గుర్తు చేస్తున్నారు. పోలీసు ఉద్యోగాలకు మాత్రం వెయ్యి రూపాయల దాకా (అంటే ఐదు రెట్లు) వసూలు చేస్తున్నారని ఆందోళన చెందుతున్నారు.