పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు
బంగారం కొనుగోలు దారులకు బులియన్ మార్కెట్ నుంచి సానుకూల పవనాలు వీస్తున్నాయి. గత కొద్ది రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు రెండు మూడు రోజులుగా తగ్గుముఖం పడుతున్నాయి. దేశీయ మార్కెట్లో మంగళవారం బంగారం 24 క్యారెట్, 22 క్యారెట్, వెండి ధరలు చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర నిన్నటితో పోలిస్తే రూ. 700 తగ్గి రూ. 51,230కి చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 600 తగ్గి రూ. 47,000 వద్ద నిలిచింది. దీంతో పాటు వెండి ధర కేజీకి రూ. 400 తగ్గి రూ. 60,700 వద్ద ట్రేడ్ అవుతోంది. విజయవాడ, విశాఖపట్టణంలోనూ ఇవే ధరలు ఉన్నాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు దిగిరావడం, ఫెడ్ వడ్డీ రేట్లు పెంచడం, ద్రవ్యోల్బణం దిగి రావడంతో బంగారం ధరలు తగ్గుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సమీప భవిష్యత్తులో కూడా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడతాయని, పసిడిలో పెట్టుబడి పెట్టడానికి ఇది తగిన సమయమేనని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి.