పీఓకేపై ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు.. - MicTv.in - Telugu News
mictv telugu

పీఓకేపై ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు..

January 17, 2020

Pakistan PM Imran khan.

పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే)ను తిరిగి స్వాధీనం చేసుకుంటామని అటు మోదీ ప్రభుత్వం, ఇటు భారత సైన్యం చెబుతున్న నేపథ్యంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. ‘పీఓకే ప్రజలకు స్వేచ్ఛ ఉంది. వారు స్వతంత్రంగా ఉండాలో, లేకపోతే మరే దేశంలోనైనా అంతర్భాగంగా ఉండాల్లో నిర్ణయించుకోవచ్చు. దీనిపై రిఫరిండమ్ నిర్వహించడానికి మేం సిద్ధంగా ఉన్నాం. అయితే పీఓకే ప్రజలు మాతోనే ఉంటారని నేను భావిస్తున్నాను.. ’ అని జర్మన్ మీడియాకు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. పనిలో పనిగా భారత్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. పీఓకేతో పోలిస్తే భారత ఆక్రమిత కశ్మీర్ లోనే ఎక్కువగా హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయి, కావాలంటే అంతర్జాతీయ పరిశీలకులు పీఓకేకు వచ్చి చూడొచ్చని అన్నారు. 

భారత్ ఆరెసెస్ చేతుల్లోకి వెళ్లిపోయిందని, ప్రస్తుతం ఆ దేశాన్ని అతివాదులు పాలిస్తున్నారని అన్నారు. ‘భారత్‌తో మాకు తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న సమయంలో నేను ప్రధానిగా బాధ్యతలు చేపట్టాను. తిరిగి స్నేహ సంబంధాలు నెరుపుదామని మోదీని కోరాను. కానీ ఆయన నుంచి స్పందనే లేదు. హిట్లర్‌ నాజీయిజం సిద్ధాంతం నుంచి ప్రేరణ పొందిన ఆర్‌ఎస్‌ఎస్‌ పెత్తనంతో ఆయన ప్రభుత్వం నడుస్తోంది. అందుకే మాతో చర్చలకు దూరంగా ఉంటున్నారు. కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370ని రద్దు చేశాక అక్కడ పరిస్థితి దిగజారింది. ఐదు నెలలుగా ఇంటర్నెట్ లేదు. మానవహక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతోంది. పీఓకే దీనికి భిన్నంగా ప్రశాంతగా ఉంది. అక్కడి ప్రజలు కోరుకుంటే ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తాం.. ’ అని అన్నారు.