లంచం ఇవ్వలేదని దారుణం.. 4 ఏళ్ల బాలుడికి 104 ఏళ్లని - MicTv.in - Telugu News
mictv telugu

లంచం ఇవ్వలేదని దారుణం.. 4 ఏళ్ల బాలుడికి 104 ఏళ్లని

January 22, 2020

Refused Bribe Bureaucrat Add 100 Years to Kids Age

ప్రభుత్వ ఆఫీసుల్లో ఏదైనా పని కావాలంటే అధికారులకు ఎంతో కొంత ముట్టజెప్పాల్సిందే. అలా కాదని ఎవరైనా మొండికేస్తే మాత్రం వారిని రకరకాలుగా ఇబ్బందులు పెడుతూనే ఉంటారు. తాజాగా యూపీలోనూ ఇలాంటి ఓ ఘటన అధికారుల పరాకాష్టకు అద్దం పట్టేలా ఉంది. రూ. 500 లంచం ఇవ్వలేదని ఓ చిన్నారి బర్త్ సర్టిఫికెట్‌లో 4 ఏళ్లకు బదులు 104 ఏళ్లు అని తప్పుగా రాసి ఇవ్వడం విమర్శలకు దారి తీస్తోంది. 

షాజహాన్‌పూర్‌ జిల్లాలోని బేల గ్రామానికి చెందిన పవన్‌ కుమార్‌ తన పిల్లల బర్త్‌ సర్టిఫికెట్ల కోసం వీడీవో(విలేజ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌) సుశీల్‌ చంద్‌, వీహెచ్‌వో(విలేజ్‌ హెడ్‌ ఆఫీసర్‌) ప్రవీణ్‌ మిశ్రాను సంప్రదించాడు. సర్టిఫికెట్ ఇవ్వాలంటే తమకు ఒక్కొక్కరికి రూ. 500 చొప్పున మొత్తం రూ. 100 ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ శాఖలో పని చేస్తున్న వారికి తాను ఎందుకు లంచం ఇచ్చేది లేదని తేల్చి చెప్పాడు. అతని చర్యతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆ అధికారులు తప్పుగా సర్టిఫికెట్ ఇచ్చారు. 

నాలుగేళ్ల వయసున్న శుభ్‌కు 104 ఏళ్లు, రెండేళ్ల వయసున్న సంకేత్‌కు 102 ఏళ్లు అని ఇచ్చారు. ఈ విషయాన్ని పవన్ కుమార్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. వెంటనే దీనిపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సామాన్యులను ఇలా అధికారులు లంచాల కోసం పీడించడాన్ని పలువురు తప్పుబడుతున్నారు.