టైటిల్ చూసి ఎలా సాధ్యమనుకుంటున్నారా? మామూలుగా కష్టపడి సంపాదిస్తే మన జీవితకాలంలో ఇందులో పదో వంతు కూడా సంపాదించడం కష్టం. కానీ స్టాక్ మార్కెట్లో ఇది సాధ్యమవుతుంది. బ్రిలియంట్ ఇన్వెస్టర్ రాకేశ్ ఝన్‌ఝన్ వాలా గురించి మీరు వినే ఉంటారు. తెలివిగా పెట్టుబడి పెట్టి వేల కోట్లు సంపాదించిన ఆయన గతేడాది మరణించారు. ఆయన పేరు మీద ఉన్న షేర్లన్నీ భార్య రేఖా ఝన్‌ఝన్‌వాలాకి బదిలీ అయ్యాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది స్టార్ హెల్త్ షేరు. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో గరిష్ట స్థాయి రూ. 556.95ని తాకింది.
దీంతో ఒక్కో ఈక్విటీ షేరు ధర రూ. 47.90 పెరగగా, ఈ దెబ్బతో కేవలం నాలుగు గంటల్లోనే రూ. 482 కోట్ల ఆదాయం సమకూరింది. ఇక స్టార్ హెల్త్‌లో ఈమె వాటా 17.50 శాతం ఉండడం గమనార్హం. ఇదే ఆశ్చర్యమనుకుంటే రేఖా మరో ఘనతను సాధించారు. టాటా కంపెనీలో పెట్టిన పెట్టుబడుల ద్వారా ఇటీవల రెండు వారాల్లోనే వెయ్యి కోట్లు సంపాదించారు. దీంతో దేశంలోనే అత్యంత సంపన్న మహిళల్లో ఒకరిగా రేఖా ఝన్‌ఝన్‌వాలా నిలిచారు. ఇప్పుడు ఆమె ఆస్తి విలువ రూ. 47 వేల 650 కోట్లుగా ఉన్నట్టు ఒక అంచనా.