ఆస్తి కోసం నీచం.. అబ్బాయికి కు.ని. ఆపరేషన్  - MicTv.in - Telugu News
mictv telugu

ఆస్తి కోసం నీచం.. అబ్బాయికి కు.ని. ఆపరేషన్ 

August 29, 2019

family ....

ఆస్తిపాస్తులు వారసత్వంగా ముందుకు సాగుతుంటాయి. అలాంటి వారసత్వమే లేకుండా చేయాలని ఓ వ్యక్తి కుట్ర పన్నాడు. బంధువు రాబందులు అంటుంటారు. ఆ నానుడికి సరిగ్గా సరిపోయే రకం మనిషి ఇతను. తన సమీప బంధువుకు పిల్లలు పుట్టకుండా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించాడు. ఈ ఘటన యూపీలోని మాధురి దేవీ రావత్‌పుర్‌‌లో చోటు చేసుకుంది. 

రావత్‌పుర్‌కు చెందిన ఓ మహిళ భర్త చనిపోయాడు. అప్పటినుంచి ఆమె తన 22 ఏళ్ల కుమారుడు ఆనంద్‌తో జీవిస్తున్నారు. ఆమెకు 4 బిఘాల పొలం, 83 గజాల భూమి ఉన్నాయి. అయితే ఆ ఆస్తిపై ఆమె సమీప బంధువు శివనాథ్ కన్నేశాడు. ఆస్తి తన చేజిక్కించుకోవాలని ఓ పథకం పన్నాడు. వారి కుటుంబంలో వారసత్వం లేకుండా చేయాలని.. తద్వారా వారసత్వం లేకపోతే తానే ఆ ఆస్తిని కాజెయ్యవచ్చని చాలా దూరంగా ఆలోచించాడు.  

ఈ క్రమంలో తన ముగ్గురు స్నేహితులను వెంట తీసుకుని వెళ్లాడు. ఏదో పనిమీద డబల్‌పులియాకు వెళుతున్న ఆనంద్‌ను అడ్డగించి బలవంతంగా ఓ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ అతనికి మత్తు మందు ఇచ్చి కొన్ని కాగితాలపై వేలిముద్రలు తీసుకున్నాడు. తర్వాత కు.ని. శస్త్రచికిత్స చేయించేశాడు. అపస్మారక స్థితి నుంచి కోలుకున్న ఆనంద్‌ ఇంటికి వెళ్లి జరిగిందంతా తన తల్లికి చెప్పాడు. విషయం తెలుసుకున్న ఇద్దరూ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.