మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఇంటి ముందు బంధువులు గురువారం నిరసనకు దిగారు. తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించాలంటూ ఒత్తిడి తెచ్చారు. అఖిల ప్రియ తల్లిదండ్రులు భూమా నాగిరెడ్డి, భూమా శోభా నాగిరెడ్డిలు ఉన్న కాలంలో బంధువల వద్ద రూ. 8 కోట్లను అప్పుగా తీసుకున్నారు. వారు చనిపోయిన తర్వాత తీసుకున్న అప్పులు వారసురాలిగా అఖిలప్రియను చెల్లించమని అడుగుతుంటే సరైన సమాధానం ఇవ్వట్లేదు. మీకు తానెలాంటి అప్పు లేనని, తాను ఏమైనా పత్రాలు రాసిచ్చి ఉంటే చూపాలని దురుసుగా అనడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. శుక్రవారం మధ్యాహ్నం మరికొందరు బంధువులు తోడై మరోసారి ఇంటి మీదకు వెళ్లడంతో కొందరు మధ్యవర్తులు బంధువులను సముదాయించి బయటకు తీసుకొచ్చారు. విషయం తెలిసిన వెంటనే ఆళ్లగడ్డ పట్టణ ఎస్సై వెంకటరెడ్డి చేరుకొని బంధువులకు సర్దిచెప్పారు. కాగా, భూమా శోభా నాగిరెడ్డి, భూమా నాగిరెడ్డిలు అకస్మాత్తుగా చనిపోయిన విషయం తెలిసిందే. శోభా నాగిరెడ్డి కారు ప్రమాదంలో మరణించగా, భూమా నాగిరెడ్డి గుండెపోటుతో చనిపోయారు.