రోడ్డులేక ప్రసవం కోసం నరకయాతన..డోలి కట్టి ఆస్పత్రికి - MicTv.in - Telugu News
mictv telugu

రోడ్డులేక ప్రసవం కోసం నరకయాతన..డోలి కట్టి ఆస్పత్రికి

December 4, 2019

Pregnant Women 01

అడుగు బయటపెట్టకుండానే అన్ని మన ముందుకు వచ్చే సాంకేతిక విప్లవం వచ్చిన రోజుల్లో కూడా ఏజెన్సీ ప్రాంతాల ప్రజల జీవితాలు మారడం లేదు. ఇంకా చాలా గ్రామాలకు రోడ్డు మార్గాలు లేక అవస్థలుపడుతూనే ఉన్నారు. ఎప్పుడైనా వైద్యం కోసం అత్యవసరంగా వెళ్లాల్సి వస్తే పాత పద్దతిలో డోలి కట్టుకొని కొండలు, వాగులు దాటుతూ నడిచి వెళ్లాల్సిందే. తాజాగా ఇలాంటి ఘటనే తమిళనాడులోని  బర్గూర్‌కొండ ప్రాంతంలోని సుండాపూర్‌ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 

కుమారి అనే మహిళకు ఒక్కసారిగా పురిటి నొప్పులు రావడంతో విలవిలలాడిపోయింది. వెంటనే ఆమె భర్తడోలి కట్టి గ్రామస్థులతో కలిసి ఆరు కిలో మీటర్ల దూరం నడుచుకుంటూ తీసుకెళ్లారు. రోడ్డు మార్గానికి చేరుకొని లారీలో ఆస్పత్రికి తరలిస్తుండగా అందులోనే మగ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి,బిడ్డా క్షేమంగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు. సరైన రోడ్డు మార్గం లేక ఇలా అత్యవసర పరిస్థితుల్లో డోలి కట్టుకొని వెళ్లాల్సి వస్తోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సార్లు ప్రాణాలు పోయిన సంఘటనలు ఉన్నట్టు తెలిపారు.

ఏళ్లు గడిచినా తమ గ్రామానికి రోడ్డు వేసే దిక్కేలేకుండా పోయిందని ఆవేదన చెందుతున్నారు. అనారోగ్యం, అత్యవసర వైద్య సాయం కావాలన్నప్పుడు తమకు నరకయాతన తప్పడం లేదని అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు వేయించాలని కోరుతున్నారు.