Reliance Jio 5G services now available in Hyderabad and Bangalore
mictv telugu

హైదరాబాద్‌లో 5జీ సేవలు ప్రారంభం.. కొన్ని ప్రాంతాల్లోనే

November 11, 2022

ప్రముఖ టెలికం సంస్థ రిలయన్స్ జియో అక్టోబర్‌ నెలలోనే దేశంలో 5జీ సేవలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. తొలి దశలో భాగంగా ముందుగా 6 నగరాల్లో జియో ట్రూ 5జీ (Jio True 5G) సర్వీస్‌లు ప్రారంభించగా, తాజాగా మరో రెండు నగరాలకు తన 5జీ సర్వీస్‌లను విస్తరించింది. హైదరాబాద్‌, బెంగళూరు నగరాల్లో ట్రూ-5జీ సేవలను ప్రారంభించినట్లు రిలయన్స్‌ జియో గురువారం ప్రకటించింది. 5జీ సేవలు నగరం అంతటా కాకుండా, తొలుత కొన్ని ప్రాంతాల్లోనే లభించే వీలుంది. సేవల్లో నాణ్యత కోసమే ట్రూ-5జీ సేవలను వివిధ నగరాల్లో దశలవారీగా ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. జియో ట్రూ-5జీ వెల్‌కమ్‌ ఆఫర్‌లో భాగంగా, ప్రస్తుత వినియోగదార్లు ఎటువంటి అదనపు చెల్లింపులు లేకుండా 1జీబీపీఎస్‌ వేగంతో అపరిమిత డేటా పొందొచ్చని పేర్కొంది.

ఐఫోన్లలో 5జీ బీటా అప్‌డేట్‌.. ఎయిర్‌టెల్‌, జియో నెట్‌వర్క్‌లపై 5జీ సేవలు పొందేందుకు వీలుగా తమ ఐఫోన్లలో 5జీ బీటా సాఫ్ట్‌వేర్‌ వెర్షన్‌ను యాపిల్‌ అప్‌డేట్‌ చేసింది. వినియోగదార్లు ఈ అప్‌డేట్‌ ఇన్‌స్టాల్‌ చేసుకుని, 5జీ సేవలను వాడుకోవాలని.. ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కరించేందుకే బీటా వెర్షన్‌ తీసుకొచ్చినట్లు యాపిల్‌ పేర్కొంది. డిసెంబరులో పూర్తి స్థాయి సాఫ్ట్‌వేర్‌ను విడుదల చేస్తామని వివరించింది.