reliance jio launch the jiobook laptop, device now available for less than rs 15,000
mictv telugu

రూ.15 వేలకే ‘జియోబుక్’ ల్యాప్‌టాప్.. పూర్తి వివరాలు ఇవే..

October 21, 2022

దేశీయ టెలికం రంగ దిగ్గజం రిలయన్స్‌ జియో.. సామాన్యుడికి అందుబాటులో అతి తక్కువ ధరకే ఓ బడ్జెట్‌ ల్యాప్‌టాప్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ‘జియోబుక్‌’ పేరుతో లాంచ్‌ చేసిన ఈ ల్యాప్‌టాప్‌ ధర కేవలం రూ.15,799గా నిర్ణయించింది. అయితే బ్యాంక్ ఆఫర్‌లతో ఇంకాస్త తక్కువకే దీన్ని సొంతం చేసుకోవచ్చు. ల్యాప్‌టాప్‌ కోసం గ్లోబల్‌ టెక్నాలజీ దిగ్గజాలైన క్వాల్‌కామ్‌, మైక్రోసాఫ్ట్‌లతో జియో భాగస్వామ్యం ఏర్పర్చుకున్నది. ఇక ఆర్మ్‌ లిమిటెడ్‌ నుంచి కంప్యూటింగ్‌ చిప్స్‌, విండోస్‌ ఓఎస్‌ తయారీదారైన మైక్రోసాఫ్ట్‌ నుంచి యాప్‌లు ఈ ల్యాప్‌టాప్‌లోకి రానున్నాయి.

ఎంబెడెడ్ జియో సిమ్ కార్డ్‌, 4జీ సిమ్‌కు సపోర్ట్‌తో వచ్చిన ఈ ల్యాప్‌టాప్‌ను ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 8 గంటల పాటు పని చేస్తుందని కంపెనీ వెల్లడించింది. జియో ఓఎస్ ఆధారిత జియోబుక్‌లో థర్డ్‌ పార్టీ యాప్స్‌కు యాక్సెస్‌ ఉంది. జియోబుక్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ , 2 యూఎస్‌బీ పోర్ట్స్, 3.5ఎంఎం ఆడియో జాక్, బ్లూటూత్ 5.0, హెచ్‌డీఎంఐ మినీ, వైఫై లాంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. 4జీ నెట్వర్క్ కూడా వాడుకోవచ్చు. జియో స్టోర్‌కు వెళ్లి సిమ్ యాక్టివేషన్ చేయించాల్సి ఉంటుంది. యువర్ ఎడ్యుకేషన్ కంపానియన్, ఫీల్డ్ కంపానియన్, క్లౌడ్ కంపానియన్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. రెండు స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. జియోబుక్ బరువు 1.5 కిలోలు. ఒక ఏడాది వారెంటీ లభిస్తుంది.

జియో తన తొలి ల్యాప్‌టాప్‌ ‘ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌’(ఆసియాలోనే అతిపెద్ద డిజిటల్ టెక్నాలజీ)లో ఆవిష్కరించింది. మొదట రూ.19,500కి ధర నిర్ణయించినా, ప్రస్తుతం ధరను తగ్గించడంతోపాటు బ్యాంకు కార్డులపై ఆఫర్లు అందిస్తోంది. పలు బ్యాంకు కార్డు కొనగోళ్లపై రూ. 5,000 వరకు తక్షణ తగ్గింపు, క్రెడిట్ కార్డ్‌లపై ఫ్లాట్ 3 వేల తగ్గింపు ఆఫర్‌, అలాగే క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై రూ. 5,000 తగ్గింపును అందిస్తోంది. డెబిట్ కార్డ్ హోల్డర్లు కూడా కొంత తగ్గింపు ఉంది. ఆసక్తి గల కొనుగోలుదారులు రిలయన్స్ డిజిటల్ వెబ్‌సైట్‌లో చెక్‌ చేయవచ్చు.

జియోబుక్ స్పెసిఫికేషన్స్
• 11.6 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే
• క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్
• 2మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
• 2జీబీ ర్యామ్ సపోర్ట్
• ఎస్‌డీ కార్డుతో 32జీబీ స్టోరేజ్ , 128జీబీ వరకు స్టోరేజ్
• జియోఓఎస్‌