దేశీ టెలికాం సంస్థ రిలయన్స్ ఇప్పటికే టెలికాం రంగంలోకి ప్రవేశించి జియోను తీసుకువచ్చి సంచలనం రేపింది. ఒక్క తూటాకు నాలుగు పిట్టలు బలి అన్నట్టు మిగిలిన టెలికాం సంస్థల ఉనికిని ప్రశ్నించేలా చేసింది. తాజాగా రిలయన్స్ సంస్థ ఇప్పుడు మరో సంచలనానికి తెరతీసింది. భారత్‌లో త్వరలోనే 5జీ నెట్వర్క్ ప్రారంభం కాబోతుండగా.. ఇప్పటికే 5జీ మొబైల్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే, ఈ 5జీ మొబైల్ ఫోన్లు కొనాలంటే సామాన్యుడికి చుక్కలు కనిపిస్తున్నాయి. రూ.27 వేల నుంచి ప్రారంభం అయి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో 5జీ ఫోన్ కొనాలనే తపనను సామాన్యులు విరమించుకుంటున్నారు. ఇలాంటి సమయంలో సామాన్యుల కోసం రిలయన్స్ సంస్థ ప్రపంచంలోనే అతి తక్కువ ధరకు 5జీ మొబైల్‌ను అందించడానికి సిద్ధం అవుతోంది.
ఈ క్రమంలో త్వరలోనే 5 జీ మొబైల్ ఫోన్‌ను లాంచ్ చేస్తామని ప్రకటించింది. వినియోగదారుల నుంచి వచ్చే డిమాండ్‌ను బట్టి జియో 5జీ మొబైల్ ధర రూ.2,500 నుంచి 3 వేల రూపాయల వరకు ఉండొచ్చని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. గూగుల్‌తో చేతులు కలిపిన జియో ఈ మొబైల్‌ను తయారు చేసేందుకు సిద్ధం అవుతోంది. అయితే, దీనిని ఎప్పుడు విడుదల చేస్తారన్నది అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కాగా, భారత్‌లో 35 కోట్ల మంది ఇంకా 2జీ మొబైల్స్‌ను వాడుతున్నారు. వీరిని ఆకర్షించడమే లక్ష్యంగా జియో అతి తక్కువ ధరకు 5జీ మొబైల్‌ను తీసుకురాబోతోంది.