ముఖేష్ అంబానీకి చెందిన ప్రముఖ టెలికం కంపెనీ రిలయన్స్ జియో వినియోగదారులకు షాకిచ్చింది. వాయిస్, డేటా ఛార్జీలను 40 శాతం మేర పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈమేరకు జియో కొత్త టారిఫ్ వివరాలను ఆదివారం ప్రకటించింది. అయితే ప్లాన్ల వారీగా ఎంత పెంచుతుందో మాత్రం బయటపెట్టలేదు. వొడాఫోన్ ఐడియా, ఎయిర్టెల్ కంపెనీలు సవరించిన ధరలతో కొత్త ప్లాన్లు బయటికి తెచ్చాక జియో కూడా తన ప్లాన్ల పూర్తి వివరాలు ప్రకటించే అవకాశముంది.
మొత్తానికి జియో ధరలు 40శాతం ధరలు పెరగనున్నాయి. డిసెంబరు 6 నుంచి రిలయన్స్ జియో అందిస్తున్న ఆల్ ఇన్ వన్ ప్యాక్‌లలోనూ మార్పులు ఉండనున్నాయి. ఇటీవల ఐయూసీ ఛార్జీలు అంటూ జియో ప్యాక్‌లలో మార్పులు తీసుకొని వచ్చిన సంగతి తెల్సిందే. కొత్తగా రానున్న ప్యాక్‌లతో ఆల్ ఇన్ వన్ ప్లాన్లలో అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్, అన్ లిమిటెడ్ డేటా వాడుకోవచ్చు. ఏ ఇతర నెట్‌వర్క్‌లకైనా ఉచితంగా ఎంతసేపటి వరకైనా మాట్లాడుకోవచ్చు. దీని కోసం ఆల్ ఇన్ వన్ ప్యాక్‌లు 40శాతం పెంచారు. తమకు కస్టమర్ సంతృప్తి ముఖ్యమని, ఈ ప్యాక్‌లతో 300 శాతం ఎక్కువ బెనిఫిట్లు పొందుతారని జియో చెప్పుకొచ్చింది. జియో బాటలోనే ఎయిర్టెల్, ఐడియా, వోడాఫోన్లు కూడా భారీగా చార్జీలు పెంచాయి.