వేసవిలో కూల్ డ్రింక్స్‌కు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని వేసవి తాపాన్ని తీర్చేందకు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ ఒకప్పటి ఐకానిన్ డ్రింక్స్‌ను మరోసారి ఇండియాలో రీలాంచ్ చేశారు. 50 ఏళ్ల ఐకానిక్ డ్రింక్ బ్రాండ్ కాంపా కోలాను సరికొత్త అవతార్‌లో తిరిగి ప్రారంభించారు. దీంతో అదానీ, ఐటీసీ, యూనిలీవర్‌లకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. రిలయన్స్ కంన్జ్యూమర్ ప్రాడక్ట్స్ లిమిటెడ్, రూ.22 కోట్లకు ప్యూర్ డ్రింక్స్ గ్రూప్ నుంచి కాంపా బ్రాండ్‌ను కొనుగోలు చేసింది. మార్కెట్లోకి ఈ సాఫ్ట్ డ్రింక్స్‌ను విడుదల చేసినట్లు రిలయన్స్ ప్రకటించింది.
కాంపా పోర్ట్ ఫోలియోలో కాంపా కోలా, కాంపా లెమెన్, కాంపా ఆరేంజ్ ఫ్లేవర్లలో సాఫ్ట్ డ్రింక్స్ అందుబాటులో ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల నుంచే విక్రయాలు జరుగనున్నాయి. దశలవారీగా మిగతా రాష్ట్రాల్లో మార్కెట్‌ను విస్తరించనున్నారు. 1970, 1980లలో భారత్ సాఫ్ట్ డ్రింక్స్ మార్కెట్లో కాంపా కోలాదే హవా . కానీ కోకా-కోలా , పెప్సికో వంటి విదేశీ బ్రాండ్ల రాకతో దీని డిమాండ్ తగ్గిపోయింది. ఇప్పటికే రీటైల్ మార్కెట్లో రిలయన్స్ దూసుకుపోతోంది. ఇదే క్రమంలో ఈ దేశీ సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్‌ను రీలాంచ్ చేసి కోకాకోలా, పెప్సీ వంటి సంస్థలకు గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తోంది.