తిరుమల మెట్ల దారికి రిలయన్స్ రూ.25 కోట్లు  - MicTv.in - Telugu News
mictv telugu

తిరుమల మెట్ల దారికి రిలయన్స్ రూ.25 కోట్లు 

September 28, 2020

Reliance spends Rs 25 crore on Tirumala stairway

తిరుమల మెట్లదారికి రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ రూ.25 కోట్లు ఇవ్వడానికి ముందుకువచ్చింది. ఏడుకొండలవాడిని దర్శించుకునేందుకు ఎక్కువ మంది భక్తులు వచ్చే కాలి నడక మార్గం (అలిపిరి నుంచి జీఎన్‌సీ వరకు)ను టీటీడీ పునరుద్ధరిస్తోంది. మరింత సౌకర్యవంతంగా, ఆధునికంగా ఆ మార్గాన్ని మార్చబోతోంది. ఇందుకు సంబంధించి అలిపిరిలో జరిగిన భూమి పూజలో టీటీడీ పాలక మండలి అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి, ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, తుడా చైర్మన్ అండ్ టీటీడీ ఎక్స్ అఫీషియో సభ్యుడు డాక్టర్ సి భాస్కర రెడ్డి పాల్గొన్నారు. అలిపిరి కాలి మార్గం ఎప్పుడో రెండున్నర దశాబ్దాల కిందట నిర్మించిందని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఇప్పుడు అది చాలా వరకూ బాగాలేదని.. అందువల్ల దాన్ని పునరుద్ధరించాలని టీటీడీ నిర్ణయించిందని పేర్కొన్నారు. మొత్తం 7.6 కిలోమీటర్ల మార్గాన్ని ఆధునీకరించి షెల్డర్లను మెరుగుపరుస్తామని వెల్లడించారు. దీంతో భక్తులకు రక్షణ, భద్రత కల్పించినట్లు అవుతుందని అన్నారు. 

సాధారణ రోజుల్లో అలిపిరి కాలి నడక మార్గంలో రోజూ 20 వేల మంది భక్తులు తిరుపతి నుంచి తిరుమలకు వస్తారని చెప్పారు. ‘వేసవి సెలవులు, ఇతర పండగ రోజుల్లో రోజూ ఏకంగా 40 వేల మందికి పైగా ఈ మార్గంలో ముందుకు వెళ్తారు. ఈ మార్గాన్ని పునరుద్ధరించాలని భావించాం. పైన స్లాబులు, టాయిలెట్స్, తాగు నీటి పైపులు, హెల్త్ సెంటర్లు, సెక్యూరిటీ ఔట్ పోస్టులు, ఎలక్ట్రిసిటీ, ప్రజలకు సమాచారం ఇచ్చే ప్రసార వ్యవస్థ కేబుల్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. దీనికి మొత్తం రూ.25 కోట్ల వ్యయం అవుతుంది. ఈ మొత్తం ఖర్చును భరించేందుకు, డొనేషన్ రూపంలో డబ్బు ఇచ్చేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ ముందుకు వచ్చింది. ఈ ప్రాజెక్టును ఇంతకుముందే ప్రారంభించాల్సి ఉండగా.. కరోనా కారణంగా కొంత ఆలస్యమైంది. ముఖ్యమంత్రి జగన్ ఈ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలనీ, తద్వారా భక్తులకు వీలైనంత త్వరగా ప్రయోజనం కలుగుతుందని అన్నారు. దీంతో వెంటనే ఇవాళ భూమిపూజ చేసి పనులు ప్రారంభించాం’ అని తెలిపారు. కాగా, ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో భాగస్వామ్యం అవుతుండటం తమకెంతో ఆనందంగా ఉందని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ స్టేట్ కన్‌స్ట్రక్షన్స్ హెడ్ ఏవీవీఎస్ రావు అన్నారు. అంచనా సమయానికే ఈ ప్రాజెక్టును పూర్తి చేసి భక్తులకు ప్రయోజనం కలిగిస్తామని ఆయన తెలిపారు.