హిందూమతాన్ని కాదు, బీజేపీని తిట్టండి.. - MicTv.in - Telugu News
mictv telugu

హిందూమతాన్ని కాదు, బీజేపీని తిట్టండి..

April 21, 2018

మన దేశం సైన్స్, టెక్నాలజీ వంటి రంగాల్లో ముందుకెళ్తోంది. అయితే నీతిబాహ్య రాజకీయాల పుణ్యమా అని చాలా విషయాల్లో వెనక్కి వెళ్తోంది. పేదరికం, నిరుద్యోగం, అత్యాచారాలు, అనారోగ్యాలు, మతహింస వంటి విషయాల్లో మనకు మనమేసాటి. మత రాజకీయాలు దేశాన్ని మరింత భ్రష్టుపట్టిస్తున్నాయి. మతం, రాజకీయం ఏ క్షణాన కలగలసిపోయాయోగాని అప్పటినుంచి ఎందుకూ కొరగాని, పనికిమాలిన విషయాలు ప్రధాన్యం సంతరించుకుంటూ వస్తున్నాయి. పేదరికం, నిరుద్యోగం, రైతాంగ సమస్యలు వంటి కీలక అంశాలు చర్చకు రాకుండా పోతున్నాయి. ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే.. ప్రస్తుతం అత్యాచారాలపై సాగుతున్న నిరసనల్లో నిష్కారణ విమర్శలు చోటుచేసుకుంటున్నాయి కాబట్టి..

నిందితులు హిందువులు కనుక..

కతువాలో ఎనిమిదేళ్ల బాలిక ఆసిఫాపై జరిగిన సామూహిక అత్యాచారం, హత్యపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘోరంపై పోలీసులు చార్జిషీటు దాఖలు చేశారు. కోర్టులు తమ పని తాము చేసుకుపోతున్నాయి. అయితే ఈ దారుణం వెనుక మత కోణం కూడా ఉండడం విషయాన్ని సంక్లిష్టం చేసింది. నిందితులకు ముస్లింలపై ఇదివరకు గొడవలు వున్నాయన్నది కాదనలేని నిజం. గొర్రెలు, గుర్రాలు పెంచే బకర్వాల్ ముస్లింలకు గుణపాఠం నేర్పడానికే ఈ ఘోరం చేశామని ఓ నిందితుడు చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. చార్జిషీటులో ఈ విషయాలను ప్రస్తావించారు. మరోపక్క.. ఉత్తరప్రదేశ్‌లోని ఓ బీజేపీ ఎమ్మెల్యే కూడా గ్యాంగ్ రేప్ కేసులో కటకాలు లెక్కిస్తున్నాడు.

నిందితులకు బీజేపీ వత్తాసు..

కతువా, ఉన్నావ్ రేప్ కేసుల్లో నిందితులు హిందువులు కావడంతో హిందూత్వ భావజాలానికి ప్రతినిధిగా భావించుకునే బీజేపీ రంగంలోకి దిగింది. ఇద్దరు జమ్మూకశ్మీర్ బీజేపీ మంత్రులు ర్యాలీలో పాల్గొన్నారు. కేంద్రమంత్రుల్లో కొందరు పరోక్ష మద్దతు ప్రకటించారు. హిందువులను అన్యాయంగా కేసులో ఇరికిస్తున్నారని, ఇది ‘అఖండ భారత హిందూసమాజానికి’ ప్రమాదమని బీజేపీ నేతలు హెచ్చరిస్తున్నారు. మరోమాటలో చెప్పాలంటే.. ‘హిందువులు నేరం చేసినా వదిలేయాలి..’ అని డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్లకు భారీగానే మద్దతు లభిస్తోంది కూడా. హిందుత్వ నేరాలపై స్పందించే ‘సెక్యులర్’ పార్టీలు, నేతలు.. వేరే మతాల నేరాలపై స్పందించకపోవడం దీనికి కారణం.

మధ్యలో హిందూ దేవుళ్లు ఏం చేశారు?

హిందూ, బీజేపీ నేతలు కొన్నిమతాలకు వ్యతిరేకంగా చేస్తున్న వ్యాఖ్యలపై సహజంగా వాటి వ్యతిరేక వర్గాలు భగ్గుమంటున్నాయి. ఆవేశంలో బీజేపీ నేతలను విమర్శిస్తూ హిందూత్వాన్ని కూడా విమర్శిస్తున్నాయి. బీజేపీ నేతల పనికిమాలిన ప్రకటనలు, రాజకీయాలను చూసి హిందూమతం కూడా అలాంటి పనికిమాలినదేనని దుమ్మెత్తి పోస్తున్నారు. హిందువుల మనోభావాలను గాయపరిచేలా రాముడు, కృష్ణుడు వంటి దేవుళ్లపై కార్టూన్లు వేస్తున్నారు. కొందరైతే త్రిశూలం వంటి మత చిహ్నాలను పురుషాంగాల్లా మార్చి, వాటికి జంధ్యాలు చుట్టి చూపుతున్నారు. కొందరు యోనిని భారతదేశపు పటంలా మార్చిచూపుతున్నారు..! ఇవి నిరసన తీవ్రతను తెలియజేస్తున్నాయి. కానీ అదే సమయంలో ఏ ఘోరనేరాలతోనూ సంబంధం లేని కోట్లాది మంది నికార్సయిన హిందువుల, దేశాభిమానుల మనోభావాలను గాయపరుస్తున్నాయి. ఫలితంగా ఈ ‘సృజనాత్మక నిరసన’పై అసలు సిసలైన, బీజేపీతో సంబంధంలేని సామాన్య హిందువులు కూడా భగ్గుమంటున్నారు.

చక్కని విమర్శలూ ఉన్నాయి..

కతువా ఘటనపై ‘సంచనలం’ కోసం, ఆవేశంతో వేసిన కార్టూన్లే కాకుండా సద్విమర్శతో, ఘాటు వ్యంగ్యంతో రంగరించిన కార్టూన్లూ వచ్చాయి. ఉదాహరణకు… ఆసిఫా పైలోకాంలో నిర్భయతో కలసి జరిపిపే సంభాషణ.. ‘అక్కా.. నీపై అఘాయిత్యం జరిగినప్పుడు దోషులను శిక్షించాలని జనం రోడ్లపైకి వచ్చారు. ఇప్పుడు నన్ను చిదిమేసిన నేరస్తులను కాపాడాలంటూ రోడ్డెక్కుతున్నారు.. మన దేశం చాలా మారిపోయిందక్కా..’ అని అంటుంది ఆసిఫా. మరో కార్టూన్లో.. పైలోకానికి వెళ్లిన ఆసిఫాతో ఓ వ్యక్తి.. ‘భయపడకమ్మా.. ఇక్కడ మతం లేదు, రాజకీయాలు లేవు, బేటీ బచావో‘ లేదు అని అంటాడు.

బీజేపీని తిట్టుకోండి..

‘‘నిందితులకు బీజేపీ వత్తాసు పలికితే, ఆ పార్టీని చెడామడా తిట్టండి. అంతేకాని దయచేసి రాముడిని, సీతను, త్రిశూలాన్ని కించపరచకండి.. ముస్లింలకు అల్లా, ఖురాన్.. క్రైస్తవులకు బైబిల్, ఏసుక్రీస్తు ఎంత పవిత్రమో మాకూ మా దేవుళ్లు, గ్రంథాలు అంత పవిత్రమైనవి. మా దేవుళ్లు, గ్రంథాలు.. వేరే మతాలపై అత్యాచారాలు, దాడులు చేయాలని చెప్పడం లేదు.. బీజేపీపై ఉన్న ఆగ్రహాన్ని దయచేసి కేవలం హిందూమతంపై విమర్శల స్థాయికి కుదించకండి.. ’’ అని హిందూ నెటిజన్లు అంటున్నారు.

హిందుత్వంలోని లోటుపాట్లు..

హిందూమతంలోని కులభేదాలు, అంటరానితనం, పురాణల్లోని కొన్ని పాత్రల ధూర్తత్వం వంటి ప్రతికూల అంశాలు హిందూమతంపై విమర్శలకు కారణం అవుతున్నాయి. ‘హిందువునని గర్వించు, హిందువుగా జీవించు..’ అని చెప్పే సంఘాలపై అంటే కొన్ని వర్గాల్లో అందుకే తీవ్ర వ్యతిరేకత ఉంది. అయితే ఈ దేశంలోని హిందువుల్లో మెజారిటీ భాగం మతసామరస్యాన్నే కోరుకుంటున్నారు. ఇతరమతాల వారితో కలసిమెలసి జీవితస్తున్నారు. మతాలన్నీ మంచే బోధిస్తాయి. అన్ని పురాణాల్లో దుష్టులు వుంటారు, దుర్మార్గాలు ఉంటాయి. కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం వాటిని రాజకీయాల కోసం వాడుకుంటున్నారు. ఓట్ల కోసం, పదవులు, అధికారం కోసం విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. ఇది హిందూమతానికే కాకుండా, ఇస్లాంకు, క్రైస్తవానికి కూడా వర్తిస్తుంది. ప్రయోజనాల విస్తృతితో తేడా ఉండొచ్చుగాని మతం, రాజకీయం కలసిన చోట లబ్ధిపొందేది స్వార్థమే!

అందుకే హత్య, అత్యాచారం, ఆర్థిక నేరం ఏదైనా సరే.. అవి ఏ పరిస్థితుల్లో జరిగాయో తెలుసుకుని స్పందించాలని, ఏక మొత్తంగా ఒక మతాన్ని విమర్శించకూడదని జనం కోరుతున్నారు. నేరస్తులు ఏ మతాలవారైనా సరే శిక్షించి తీరాలని కోరుతున్నారు. నేరాల వెనుక మతకోణం ఉన్నా, స్పందనలో సంయమనం ముఖ్యమని, కోట్లాదిమంది విశ్వసించే ఒక మతాన్ని ఒక పార్టీకి గంపగుత్తగా కట్టబెట్టి విమర్శించడం వల్ల సమస్య ఇంకా క్లిష్టం అవుతుందని అంటున్నారు…!