కేరళలోని ఎర్నాకులంలోని తిరువైరానికుళం మహాదేవ ఆలయంలోకి నటి అమలాపాల్ ని అనుమతించలేదు. దీనికి కారణం మతపరమైన వివక్షే అంటూ నటి ఆరోపించారు.
సోమవారం కేరళలోని అమ్మవారి గుడికి వెళ్లింది అమలాపాల్. కానీ ఆలయ అధికారులు ఆమెను లోపలికి అనుమతించలేదు. ఆ ప్రాంగణంలోకి కేవలం హిందువులను మాత్రమే అనుమతించే ఆచారం ఉందని తెలియచేశారు. తనకు దర్శనం లేదని, ఆలయం ముందు ఉన్న రహదారి దగ్గర నుంచి అమ్మవారి దర్శనం చేసుకోమని బలవంతం చేశారని నటి పేర్కొన్నది. అమ్మవారిని చూడనప్పటికీ తాను అమ్మ ఆత్మను అనుభవిస్తున్నట్లుగా ఆలయ సందర్శకుల రిజిస్టర్ లో తన అనుభవాన్ని పంచుకుంది అమలాపాల్.
‘2023లో కూడా మతపరమైన వివక్ష కొనసాగడం విచారకరం. అంతేకాదు.. నిరాశజనకం. నేను దేవత దగ్గరికి వెళ్లలేకపోయాను. కానీ దూరం నుంచి ఆమె ఆశీస్సులు అందుకున్నా. త్వరలో మత వివక్షలో మార్పు వస్తుందని ఆశిస్తున్నా. సమయం వస్తుంది, మనందరినీ మతం ఆధారంగా కాకుండా సమానంగా చూస్తాం’ అంటూ అమలాపాల్ పేర్కొంది.
ఈ ఘటన వెలుగులోకి వచ్చినప్పటి నుంచి తిరువైరానికుళం మహాదేవ ఆలయ ట్రస్టు ఆధ్వర్యంలోని ఆలయ నిర్వాహకులు ఉలిక్కిపడ్డారు.
అయితే.. తాము ఇప్పటికే ఉన్న ప్రోటోకాల్ ను మాత్రమే పాటిస్తున్నామని ఆలయ అధికారులు తెలిపారు. ‘ఇతర మతాలకు చెందిన భక్తులు చాలామంది ఆలయాన్ని సందర్శించేందుకు వస్తున్నారు. ఎవ్వరూ ఈ విషయం మీద గొడవ చేయలేదు. కేవలం సెలెబ్రిటీలు వస్తే మాత్రం అది వివాదాస్పదం అవుతుంది’ అని ట్రస్ట్ కార్యదర్శి ప్రసూన్ కుమార్ అన్నారు.
దక్షిణాదిలో అత్యంత డిమాండ్ నటీమణుల్లో అమలాపాల్ ఒకరు. తమిళ, మలయాళ చిత్రాలో ఆమె నటనకు పలు అవార్డులు వచ్చాయి. తెలుగులో కూడా కొన్ని సినిమాల్లో మెరిసిందీ అమ్మడు. ప్రస్తుతం.. అమలాపాల్ అజయ్ దేవగన్ రాబోయే చిత్రం ‘భోలా’లో కనిపించనుంది. ఆమె పాత్ర గురించి రహస్యంగా ఉంచుతున్నప్పటికీ.. ఈ చిత్రంలో ఆమె బనారసీ మహిళగా నటిస్తున్నట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.