కేసీఆర్ పై టిక్‌టాక్‌లో అనుచిత వ్యాఖ్యలు.. ఏపీ యువకుడి అరెస్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్ పై టిక్‌టాక్‌లో అనుచిత వ్యాఖ్యలు.. ఏపీ యువకుడి అరెస్ట్

April 24, 2019

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఏపీ యువకుడు అనుచిత వ్యాఖ్యలు చేసి కటకటాల పాలయ్యాడు. రాచకొండ సైబర్ క్రైమ్ పోలీస్ విభాగం కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా తిరువూరు గ్రామానికి చెందిన తగరం నవీన్‌(20) డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. అతను ఈనెల 14న తన స్నేహితులతో కలిసి పుట్టినరోజు వేడుక జరుపుకున్నాడు. అయితే ఈ వేడుకలో బాగా మద్యం సేవించిన నవీన్ తెలంగాణ, ఆంధ్ర రాష్ట్ర ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశాడు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కూడా తన ఇష్టమొచ్చిన రీతిన తిట్టాడు. అంతటితో ఆగకుండా అదంతా వీడియో తీసి టిక్‌టాక్‌లో అప్‌లోడ్ చేశాడు. అనంతరం సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో కూడా పోస్ట్ చేశాడు.

Remarkable comments on KCR on TickTak.. AP man arrested.

ఆ వీడియో కాస్తా వైరల్ అవడంతో తీవ్ర సంచలనంగా మారింది. ఈ వీడియోపై టీఆర్ఎస్‌వీ(తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం) రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నర్సింహ్మగౌడ్ రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నవీన్‌ను బుధవారం అరెస్ట్ చేశారు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 153(ఏ), ఐటీ యాక్ట్ సెక్షన్ 67ల కింద కేసులు నమోదు చేశారు. అతని వద్ద వున్న రెడ్ మీ వై2, రెడ్ మీ 4 స్మార్ట్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా ఇలా ప్రభుత్వాధినేతలు, అధికారుల పట్ల అనుచితంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని, చట్టరిత్యా చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు.