Remarkable 'Levanter' cloud seen over the Rock of Gibraltar
mictv telugu

కొండ నుంచి మేఘాలు పుడుతున్నాయ్.. ఈ వింతను మీరే చూడండి

September 7, 2022

ఎన్నో వింతలు, విడ్డూరాలకు ఈ విశాల ప్రపంచం నెలవు. ఒక్కోచోట ఒక్కో ప్రాంతంలో జరిగే అద్భుతాలు సోషల్ మీడియా పుణ్యమా అని తెగ వైరల్ అవుతున్నాయి. యునైటెడ్‌ కింగ్‌ డమ్‌ (యూకే)లో ఆ పెద్ద కొండ నుంచి మేఘాలు పుడుతున్న వీడియో ఒకటి ట్విటర్ లో ట్రెండ్ అవుతోంది. ఏదో పాత్ర నుంచి నీటి ఆవిరి వస్తున్నట్టుగా.. ఆ కొండ నుంచి మేఘాలు ఒకదాని తర్వాత మరొకటి ఏర్పడుతున్నాయి. యూకేలోని జీబ్రాల్టర్‌ ప్రాంతంలో సముద్ర తీరానికి కాస్త దూరంలో ఉన్నదే ఈ ఎత్తయిన జీబ్రాల్టర్‌ కొండ. దాదాపుగా మొత్తం ఒకే రాయితో ఏర్పడిన ఈ కొండ ఒక వైపున ఏకంగా 426 మీటర్ల (1,398 అడుగులు) ఎత్తున శిఖరం ఉంటుంది. అది సముద్రానికి అభిముఖంగా ఉండి.. అటు నుంచి వచ్చే గాలికి అడ్డుగా ఉంటుంది. ఈ క్రమంలో సముద్రం వైపు నుంచి వచ్చే గాలి ఈ కొండను తాకుతుండగా.. మేఘాలు ఏర్పడుతూ ఉంటాయి.

ఎక్కడైనా గాలి వీచే దిశలో పెద్ద పెద్ద పర్వతాలుగానీ, ఎత్తయిన కొండలుగానీ ఉన్నప్పుడు.. వీస్తున్న గాలి వాటికి తాకి పైకి లేస్తుంది. అలా పైకి వెళ్లినచోట తక్కువ ఉష్ణోగ్రతల కారణంగా.. ఆ గాలిలోని నీటి ఆవిరి చల్లబడి చిక్కబడుతుంది. మంచు స్పటికాలుగా మారడం మొదలై మేఘాలు ఏర్పడతాయి. ఇలా పర్వతాలు, కొండల కారణంగా ఏర్పడే మేఘాలను ‘బ్యానర్‌ క్లౌడ్‌’గా పిలుస్తుంటారు. జీబ్రాల్టర్‌ కొండ వద్ద ఏర్పడే మేఘాలు కూడా ఇదే తరహావి అని బ్రిటన్‌ వాతావరణ శాఖ తెలిపింది. జీబ్రాల్టర్‌ వాతావరణ పరిస్థితుల మేరకు ఏటా జూన్‌ నుంచి అక్టోబర్‌ వరకు ఈ చిత్రాన్ని గమనించవచ్చని స్థానికులు చెబుతున్నారు.