రెమ్‌డెసివిర్ పనిచేయడం లేదు.. డబ్ల్యూహెచ్ఓ నిరాశ  - MicTv.in - Telugu News
mictv telugu

రెమ్‌డెసివిర్ పనిచేయడం లేదు.. డబ్ల్యూహెచ్ఓ నిరాశ 

October 16, 2020

Remdesivir, hydroxychloroquine did not cut hospital stay or mortality in Covid-19 patients: WHO

కరోనా బాధితులు మరణం నుంచి బయటపడటానికి, బాధితుల కోలుకునే సమయాన్ని తగ్గించే క్రమంలో వచ్చిన రెమ్‌డెసివిర్ ఔషధం పనిచేయడంలేదని డబ్ల్యూహెచ్ఓ (ప్రపంచ ఆరోగ్య సంస్థ) వెల్లడించింది. గిలిద్‌ సైన్సెస్‌కు చెందిన ఈ యాంటీ వైరల్ ఔషధం కరోనా రోగులపై ఎటువంటి ప్రభావం చూపడంలేదని గుర్తించినట్టు డబ్ల్యూహెచ్ఓ స్పష్టంచేసింది. ప్రాణాంతక కరోనా చికిత్సలో భాగంగా ప్రయోగాత్మక ఔషధాలైన హైడ్రాక్సీక్లోరోక్విన్‌, రెమ్‌డెసివిర్‌, లోపినవిర్‌(రిటోనవిర్‌), ఇంటర్‌ఫెరాన్‌ చూపుతున్న ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు డబ్ల్యూహెచ్ఓ రంగంలోకి దిగింది. 30 దేశాలకు చెందిన 11,266 మంది వయోజనులపై క్లినికల్ ప్రయోగాలు చేసింది. ఈ క్రమంలో రెమ్‌డెసివిర్ రోగులపై ఎలాంటి ప్రభావం చూపడంలేదని తేల్చారు. మరణం నుంచి తప్పించడం, ఆసుపత్రిలో ఉండే సమయాన్ని తగ్గించడంలో రెమ్‌డెసివిర్ సహా మిగిలిన  ఔషధాలు కూడా ఎలాంటి ప్రభావం చూపించడం లేదని ఆ ప్రయోగాల ద్వారా గుర్తించినట్లు సంస్థ ప్రకటించింది. అయితే, ప్రయోగ ఫలితాలను ఇంకా సమీక్షించాల్సి ఉందని పేర్కొంది. 

డబ్ల్యూహెచ్ఓ ప్రకటనపై గిలిద్ స్పందిస్తూ.. ఆరోగ్య సంస్థ వెల్లడించిన వివరాలు స్థిరంగా లేవని తెలిపింది. ఆ సంస్థ వెల్లడించిన సమాచారం నిర్మాణాత్మకమైన శాస్త్రీయ చర్చకు అనుకూలంగా లేదని వివరించింది. కాగా, 1,062 మందిపై చేపట్టిన అధ్యయనంలో కోవిడ్ బాధితుల చికిత్సా సమయాన్ని రెమ్‌డెసివిర్‌ ఐదు రోజులు తగ్గించిందని వెల్లడైనట్లు ఇటీవల గిలిద్‌ తెలిపింది. మరోవైపు కరోనా బాధితుల చికిత్సలో వాడేందుకు మొదట ఈ ఔషధమే అనుమతి పొందింది. మే నెలలోనే అత్యవసర వినియోగానికి అమెరికాకు చెందిన ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్‌డీఏ అనుమతి ఇచ్చింది. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కరోనా సోకగా.. ఆయన చికిత్సలో కూడా ఈ ఔషధాన్ని వాడారు.