గొంగడి గుర్తున్నదా ? - MicTv.in - Telugu News
mictv telugu

గొంగడి గుర్తున్నదా ?

August 3, 2017

కొత్తదస్తే పాత వస్తువును పెక్కిచ్చి తన్నుడు మన మన్సులకు మస్తు అల్వాటు. అచ్చం అట్లనే దుప్పట్లు, షత్రంజీల రాకతోని గొంగడిని మర్శి పోయిర్రు మన జనాలు. ఇట్ల మర్చిపోవుడు మనోళ్ళకేం కొత్త గాదు. గొర్రె బూరుతోని గొంగడిని నల్లగా, మందంగా పేనుతరు గొల్ల కుర్మలు. కనీ అది అచ్చం గొంగడి పురుగు లెక్కనే వుంటది. అప్పట్ల పెద్ద మన్సులకు గొంగడి ఒక ఆభరణం, ఆయుధం లెక్క పని చేసింది. మరిచిపోయిన గొంగడిని గుర్తు జేస్తున్నడు గీ రాజలింగు అనే పెద్దమన్షి. మంచిర్యాల పరిధిల ఊరూరా తిరుక్కుంట లూన మీద ఇట్ల గొంగళ్ళను అమ్ముతున్నడు గనీ కొనేటోళ్ళు చాలా తక్కువైన్రని బాధ పడ్తున్నడు గూడ ?

గొంగడా అంటే ఏందని ? ఉల్టా అడిగే జమానల వున్నం మనం. పాపం గీ పెద్దమన్షి తిప్పలు ఎవరు పట్టిచ్చుకుంటరు ? అప్పట్ల పల్లెటూళ్ళల్లో ఒక్కొక్కరి ఇళ్ళల్లో నాలుగైదు గొంగళ్ళు వుండేటియి. వూర్లల్ల వారన్కి ఒకసారి జరిగే అంగళ్ళకు గొల్ల కుర్మలచ్చి శెట్ల కింద కూసొని మంచి మంచి గొంగళ్ళను పేనెటోళ్ళు. అంగళ్ళ కూరగాయలు ఒక దిక్కు, అల్లం – ఉల్లిగడ్డలు ఒక దిక్కు, ఎండిన మిర్పకాయలు ఒక దిక్కు, వట్టి చాపలు, రొయ్యలు, బట్టల అంగడి ఇట్ల దేనికది సప్రేటుగ వున్నట్టే గొంగడోళ్ళు గూడ సప్రేట్ గా కూసొని అమ్మెటోళ్ళు.

శాన మంది పెద్దమన్సులు గొంగళ్ళను విపరీతంగా లైక్ చసేటోళ్ళు. నిండ కప్పుకొని ముదుర్కుంటే మస్తు ఎచ్చగుంటది. మల్ల దోమలు అస్సలు కర్వయి. గొర్రెల ఉన్నితోని ముద్దుగ పేనెటోళ్ళు గొంగళ్ళను. కనీ రాను రాను సూశిర్రా గొంగళ్ళు కనవడకుంట అయిపోతున్నయి ? అదేదో గొర్రె ఎంటికెలతోని తయారైతదని దాన్ని ఇప్పటి తరమోళ్ళు అస్సలు ఇష్టపడ్తలేరు. రకరకాల దుప్పట్లు, ఉలన్ బ్లాంకెట్లు, జమ్ముకానలు రావడంతోని గొంగడికి గిరాకి పూరగనే తక్కైపోయింది. పాపం గొల్లన్నలు ఇప్పుడు గొంగళ్ళు పేనుతలేరు. ఉత్తగుండకుంట గొంగడి పేనుదామన్నా కొనే దిక్కుండదని సప్పుడుదాక ఉన్నిని కాంట పెట్టి అమ్ముకుంటున్నరు. ఇంకొన్నొద్దులైతే గొంగడిని సూతామన్నా కండ్లకు కనవడదేమో !

source: telangana today