గీతం ఆక్రమణల తొలగింపు.. హైకోర్టు స్టే - MicTv.in - Telugu News
mictv telugu

గీతం ఆక్రమణల తొలగింపు.. హైకోర్టు స్టే

October 25, 2020

hmhmnh

విశాఖపట్నం రుషికొండ సముద్రతీరంలోని గీతం విశ్వవిద్యాలయంలోని పలు నిర్మాణాలను రెవెన్యూ, జీవీఎంసీ (గ్రేటర్‌ విశాఖ మునిసిపల్‌ కార్పొరేషన్‌) అధికారులు శనివారం తెల్లవారుజామున కూల్చివేశారు. ఏళ్ల తరబడి 40.51 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఉన్న కట్టడాలను తొలగించారు. అర్ధరాత్రి దాటాక ప్రారంభమైన ఈ ఆపరేషన్‌ శనివారం ఉదయం 11 గంటల వరకు కొనసాగిన విషయం తెలిసిందే. అయితే దీనిపై హైకోర్టు స్టే విధించింది. నవంబర్‌ 30 వరకు నిర్మాణాల కూల్చివేతపై న్యాయస్థానం స్టే ఇచ్చింది. మరోపక్క కూల్చివేతలపై కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. 100 మంది పోలీసులతో అర్థరాత్రి పూట నిర్మాణాలను కూల్చివేశారని వర్సిటీ యాజమాన్యం హౌస్‌మోషన్‌ పిటిషన్ దాఖలుచేసింది. 

నోటీసులు, ఆర్డర్లు లేకుండా కూల్చడం సరికాదని పిటిషనర్‌ పేర్కొన్నారు. యూనివర్సిటీ ప్రైవేట్‌ భూముల్లో నిర్మాణాలు కూల్చారని.. అదనపు భూమి కొనడానికి డాక్యుమెంట్‌ ప్రభుత్వం వద్దే ఉందని పిటిషనర్‌ తెలిపారు. దీనిపై ఇరు వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను నవంబర్‌ 30కి వాయిదా వేసింది. గీతం యూనివర్సిటీ కట్టడాల కూల్చివేత వ్యవహారంలో తదుపరి చర్యలను సోమవారం వరకు నిలిపివేయాలని అధికారులకు న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.సురేశ్‌రెడ్డి శనివారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, గీతం ఇంజినీరింగ్‌ క్యాంపస్‌ మొత్తం 108 ఎకరాల్లో ఉండగా, దీంట్లో ఆక్రమణలో ఉన్న 40.51 ఎకరాల స్థలం విలువ రూ.350 కోట్లు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. విశాఖలోని అత్యున్నత ప్రమాణాలు కలిగిన గీతం యూనివర్సిటీ కట్టడాల కూల్చివేత వైసీపీ కక్ష సాధింపులో భాగమేనని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు విమర్శించారు. కోర్టులో ఉన్న వివాదంపై ఎటువంటి ఆదేశాలు రాకముందే యూనివర్సిటీ కట్టడాలను కూల్చేయడాన్ని తాము ఖండిస్తున్నామని తెలిపారు.